టెడ్డీబేర్ ని  కొట్టి… అన్నం తినిపిస్తున్నారా?

ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారు చక్కగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండేలా చూడాలని ప్రతి తల్లీతండ్రీ అనుకుంటారు. అందుకోసం చాలా ఓపిగ్గా వారి అల్లరిని భరిస్తుంటారు. ఏడుస్తుంటే బుజ్జగించి ఓదారుస్తుంటారు. రకరకాల కథలు చెబుతూ వారి చిన్ని బొజ్జ నింపాలని చూస్తారు.

అయితే కొంతమంది మాత్రం ఇందుకు విరుద్ధంగా… పిల్లలమీద కోపంతో అరిచేస్తుంటారు. తాము చెప్పినట్టు వినకపోతే పిల్లలను కొట్టి తిట్టి భయపెడుతుంటారు. ఈ మధ్య సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి వైరల్ అయ్యింది. అన్నం తినడానికి మారాం చేస్తున్న తన మేనల్లుడిని భయపెట్టి అన్నం తినిపించడానికి ఓ వ్యక్తి… బాబు ఆడుకునే మిక్కీ మౌస్ బొమ్మని బాగా కొడతాడు. దాంతో ఆ చిన్నారి భయంతో ఫుడ్ తింటుంటాడు.

పిల్లలకు తాము ఆడుకునే బొమ్మలతో చాలా అనుబంధం ఉంటుంది. ఎప్పుడూ టెడ్డీబేర్ ని పట్టుకుని తిరిగే పిల్లలు చాలా ఇళ్లలో కనబడుతుంటారు. దానికి స్నానం చేయించినట్టుగా, అన్నం తినిపించినట్టుగా చేస్తూ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు.

కరోనాకు నియంత్రణగా పిల్లల చేత మాస్క్ లు ధరించేలా చేయాలంటే వారు ఆడుకునే టెడ్డీ బేర్ కి మాస్క్ ని కట్టమని నిపుణులు సలహా ఇచ్చారు కూడా. మరి అలాంటి టెడ్డీబేర్ ని వారిముందే చితక్కొట్టేస్తే పిల్లలు భయభ్రాంతులకు గురవుతారు. దీనిని టెడ్డీ టార్చర్ టెక్నిక్ అంటారు. పిల్లలను భయపెట్టి మన మాట వినేలా చేయటం అన్నమాట. కొందరి ఇళ్లలో ఇలా చేస్తుంటారు.

అయితే పిల్లలను ఇంతగా భయపెట్టే ఈ టెక్నిక్ వలన వారు భయపడి మనం చెప్పినట్టుగా విన్నా… భవిష్యత్తులో  ఆహారం విషయంలో వారి ప్రవర్తన సరిగ్గా ఉండకపోయే అవకాశం ఉందని, ఆహారం విలువ కూడా వారికి అర్థం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సోషల్ మీడియాలో… బొమ్మని కొట్టి బాబుకి అన్నం తినిపించే వీడియో చూశాక చాలామంది తల్లిదండ్రులు చాలా తీవ్రంగా స్పందించారు. చిన్నారులను అంతగా భయపెట్టటం  హేయమని,  బాధాకరమని… అలాంటివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని… వీడియో చూస్తుంటే ఏడుపొచ్చేసిందని… ఇలా చాలావరకు ఆ వీడియోపై వ్యతిరేకంగానే స్పందించారు.