కోహ్లీ, టెండుల్కర్ బ్యాట్లు రిపేరు చేశాడు… తన బతుకుని రిపేర్ చేస్తున్నది సోనూసూద్!

కరోనా అనేక కఠిన నిజాలను మనముందుకు తెచ్చినట్టే… మనుషుల్లోని సేవా గుణాన్ని సైతం ప్రపంచానికి చాటింది. ముఖ్యంగా నటుడు సోనూ సూద్ లోని మానవతా కోణం దేశాన్నే నివ్వెర పరచేలా చేసింది.  సోనూసూద్ సహాయాన్ని కోరుతూ అభ్యర్థనలు ఇంకా వెల్లువలా వస్తున్నాయి. తనను సహాయం కోరుతున్నవారి అభ్యర్థనల్లో నిజం నిజాయితీ ఉంటే సోనూసూద్ వెంటనే స్పందిస్తున్నారు. అలాగే క్రికెట్ బ్యాటులు మరమ్మత్తు చేసే ఒక వ్యక్తికి సైతం సహాయం చేసేందుకు ఆయన ముందుకొచ్చారు.

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఎలాంటి క్రికెట్ పోటీలూ జరగటం లేదు. లాక్ డౌన్ తో క్రికెట్ ఆడేవారూ తగ్గిపోయారు. దీంతో అన్ని రంగాల్లోలాగే ఆ రంగంలో జీవనోపాధిని పొందుతున్నవారు కూడా బాధలు పడుతున్నారు. అలాంటివారిలో ముంబయికి చెందిన అష్రాఫ్ చౌదరి కూడా ఒకరు. ముంబయిలోని మెట్రో సినిమా వద్ద ఆయనకు క్రికెట్ బ్యాటులను రిపేరు చేసే షాపు ఉంది. తన పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన దుకాణం అది. అయితే క్రికెట్ బ్యాటులను రిపేరు చేయటంలో అష్రాఫ్ కి ప్రత్యేకంగా చాలాపేరుంది. సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ వంటివారి క్రికెట్ బ్యాట్ లను ఆయన రిపేర్ చేసి ఉన్నాడు.

లాక్ డౌన్ కాలంలో ఆయన వ్యాపారం పూర్తిగా పడిపోవటమే కాకుండా అష్రాఫ్ కిడ్నీకి సంబంధించిన వ్యాధికి గురయ్యాడు. దాంతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలు సైతం ఉన్నాయని…అష్రాఫ్ హాస్పటల్ బిల్ ని కట్టలేని స్థితిలో ఉన్నాడని… అతనికోసం విరాళాలు సేకరిస్తున్న ప్రశాంత్ జెఠ్మలానీ అనే వ్యక్తి మీడియాకు తెలిపాడు.

ట్విట్టర్ యూజర్ ఒకరు ఈ విషయాన్ని వెల్లడిస్తూ… అష్రాఫ్ కి సహాయం చేయాల్సిందిగా సోనూసూద్ ని కోరాడు.

ఆ ట్వీట్ ని గమనించిన సోనూసూద్… ‘ఈ సోదరుని చిరునామా కనుక్కోండి…’ అంటూ స్పందించాడు. సోనూ సూద్ అష్రాఫ్ కి సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు కనుక ఇక అతని కష్టాలు గట్టెక్కినట్టేనని భావించవచ్చు.