ఆ ప్రేమకథ మళ్లీ మొదలు

ఇన్నాళ్లూ సెట్స్ పైకి రావడానికి భయపడిన హీరోలంతా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. తమ సినిమాల్ని తిరిగి సెట్స్ పైకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా హీరో నాగచైతన్య కూడా బయటకొచ్చాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న లవ్ స్టోరీ సినిమా ఫైనల్ షెడ్యూల్ ను ఇవాళ్టి నుంచి స్టార్ట్ చేశాడు చైతూ.

15 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. ఇది పూర్తయితే టోటల్ సినిమా కంప్లీట్ అయిపోతుంది. ఈ షెడ్యూల్ కోసం కేవలం 15 మంది యూనిట్ ను తీసుకున్నారు. వాళ్లందరికీ ముందస్తుగా కరోనా పరీక్షలు చేయించారు. అందరికీ నెగెటివ్ వచ్చిందని నిర్థారించుకున్న తర్వాత సెట్స్ పైకి అనుమతించారు. అంతేకాదు.. ఈ 2 వారాలు యూనిట్ లో ఎవ్వర్నీ ఇంటికి పంపించడంలేదు. అందరికీ భోజన-వసతి సౌకర్యాలు కల్పించారు. షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాతే అందరూ తమ ఇళ్లకు వెళ్తారు.

ఇలా ప్రభుత్వం విధించిన పూర్తి నిబంధనల ప్రకారం లవ్ స్టోరీ సినిమా ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. మరోవైపు ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చేస్తారనే రూమర్లను కూడా యూనిట్ ఖండించింది. థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత మంచి డేట్ చూసి సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు.