నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం… కరోనా రోగి ఆత్మహత్య…

నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలోని కరోనా వార్డు అది. కరోనా రోగులతో అన్ని బెడ్లూ నిండిపోయాయి. నిత్యం వైద్యుల పర్యవేక్షణ ఉండాల్సిన సందర్భం, కనీసం వైద్య సిబ్బంది అయినా అందుబాటులో ఉండాల్సిన అవసరం. అయినా కూడా ఎవరూ అక్కడ లేరు. పక్క పేషెంట్ పరిస్థితి పట్టించుకునే ఓపిక అక్కడ ఎవరికీ లేదు.

అప్పటికే పరమేశ్వరమ్మ అనే వృద్ధురాలు తీవ్ర అనారోగ్యంతో ఉంది. పైపెచ్చు కరోనాతో ఆమె భయాందోళనలకు గురైంది. వాంతులు ఆగడంలేదు, వైద్యులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆత్మహత్యకు సిద్ధపడింది.

కరోనా వార్డులోనే పైన ఉన్న ఆక్సిజన్ పైప్ లైన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ బలవన్మరణం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో ఇదే నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ కరోనా రోగి బాత్రూమ్ లో పడిపోయి చనిపోయాడు. శానిటరీ సిబ్బంది బాత్రూమ్ లోకి వెళ్లిన తర్వాత, ఐదుగంటల ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

నిత్యం వార్డుల్లో వైద్యులు, సిబ్బంది ఉంటే ఇలాంటి పరిస్థితులు పునరావృతం అయ్యేవా. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేక, ఇంట్లో ఉండే వసతి లేక కరోనా రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తుంటారు. మంచి తిండి పెట్టకపోయినా పర్వాలేదు, మంచి వైద్యం అందించి, పిలిచిన వెంటనే పలికే పరిస్థితి ఉంటే ఇలాంటి దారుణాలు జరిగి ఉండేవి కావు.

ఇటీవలే కలెక్టర్ బదిలీ వ్యవహారం నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రిపై అజమాయిషీ విషయంలో అసంతృప్తికి లోనైన కలెక్టర్ శేషగిరిబాబు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. ఆయన స్థానంలో కొత్త కలెక్టర్ వచ్చినా పరిస్థితిలో మార్పులేదు. నిత్యం కలెక్టర్, ఇద్దరు జాయింట్ కలెక్టర్లు ఆస్పత్రికి తనిఖీలకు వెళ్తున్నా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే సిబ్బందిలో నిర్లక్ష్యం ఏమేరకు మేటవేసుకుందో అర్థం చేసుకోవచ్చు.