మోసగాడి చేతిలో తప్పించుకున్న వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు…

రెండు రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ కు ఓ ఫేక్ కాల్ వచ్చింది. ఆ తర్వాత అదే పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్సీ జకియా ఖానమ్ కి కూడా అలాంటి ఫోన్ కాల్ వచ్చింది. తాజాగా.. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ ఆ మాయగాడికి టార్గెట్ అయ్యారు. మొత్తం ఈ ముగ్గురు మహిళా నేతలకు కాల్ చేసిన వ్యక్తి ఒకడేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

జగజ్జీవన్ అనే పేరుతో ఓసారి, శ్రీనివాస్ అనే పేరుతో మరోసారి మహిళా ప్రజా ప్రతినిధులకు ఫోన్లు చేసి మెల్లగా మాటలు కలిపి తన మాయలోకి దించాలని చూశాడు. మీ మీ నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులొచ్చాయని వాటిని కేటాయించడానికి 10శాతం సొమ్ము ముందుగా మీరు డిపాజిట్ చేయండి అని కండిషన్ పెట్టాడు.

అయితే వ్యవహారం నడిపించడంలో తడబడి చివరకు పోలీసులకు టార్గెట్ అయ్యాడు. కల్యాణ దుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ కి.. శ్రీనివాస్ అనే పేరుతో ఫోన్ చేశాడు ఆ మోసగాడు. కేంద్ర ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి కేటాయించిందని, పరిశ్రమలకు ఇచ్చే రుణాల రూపంలో వీటిని ఇవ్వబోతుందని చెప్పాడు.

మూడు కోట్ల రుణం కావాలంటే ముందు 2లక్షల రూపాయలు డిపాజిట్ చేయమన్నాడు. అనుమానంతో ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులను సంప్రదించారు. అదంతా మోసం అని తేలడంతో కల్యాణ దుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన వాడి నెంబర్, బ్యాంక్ ఖాతా ఆధారంగా పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

ఆ తర్వాత ఎమ్మెల్సీ జకియా ఖానమ్ కి కూడా ఇలాంటి ఫేక్ కాల్ వచ్చింది. జగజ్జీవన్ గా పరిచయం చేసుకున్న ఆ కేటుగాడు రుణాలిప్పిస్తాం, ముందు మాకు 10శాతం డిపాజిట్ చేయండి అన్నాడు. దీంతో ఆమె కూడా పోలీసులను ఆశ్రయించారు.

తాజాగా ఎమ్మెల్యే విడదల రజినికి ఫోన్ చేసి రుణాలు, ముందస్తు ముడుపులు అంటూ బేరాలాడాడు. అప్పటికే రెండు ఉదాహరణలు జరగడంతో ఎమ్మెల్యే రజిని మరింత అప్రమత్తమయ్యారు. వాడిని లైన్లోనే పెట్టి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వాడి ఫోన్ నెంబర్, లొకేషన్ కూడా ట్రేస్ చేశారు పోలీసులు. అయితే పోలీసులు వెళ్లే సరికి వాడు పారిపోయాడు.

ఈ మూడు సంఘటనలకు కారణం ఒకడేనని అనుమానిస్తున్నారు పోలీసులు. శ్రీనివాస్ అలియాస్ జగజ్జీవన్ కోసం గాలిస్తున్నారు. మహిళా ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేసుకుని మరీ ఈ మోసాలకు తెరతీశాడు ఆ కేటుగాడు. అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ.. అలర్ట్ గా ఉండటంతో.. వాడి పాచిక పారలేదు.