లెక్కలు చూసుకునేలోపే… మంచం కింద నిద్రపోయిన దొంగ

తూర్పుగోదావరి జిల్లాలో ఒక దొంగ దొంగతానికి వచ్చి మంచం కింద నిద్రపోయాడు. చివరకు ఇంటి యజమాని చాకచక్యంగా వ్యవహరించడంతో పోలీసులకు దొరికిపోయాడు. గోకవరంలో సత్తి వెంకటరెడ్డి పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నాడు. రోజులాగే రాత్రి 10.15 సమయంలో బంక్‌ వద్ద పని ముగించుకుని నగదుతో ఇంటికి బయలు దేరాడు.

పసిగట్టిన దొంగ సూరిబాబు … వెంకటరెడ్డిని ఫాలో అయ్యాడు. వెంకటరెడ్డి ఇంట్లోకి వెళ్లగానే ఇతడు కూడా లోనికి చొరబడి మంచం కింద దాక్కున్నాడు. వెంకటరెడ్డి నిద్రపోగానే నగదు ఎత్తుకుపోవాలని సూరిబాబు భావించాడు. కానీ వెంకటరెడ్డి లావాదేవీలకు సంబంధించిన లెక్కలు చూసుకుంటూ రాత్రి ఒంటి గంట వరకు మెలుకువగానే ఉన్నాడు. ఇంతలోనే మంచం కింద దాక్కున్న దొంగ నిద్రలోకి జారుకున్నాడు.

తెల్లవారుజామున నాలుగున్నర సమయంలో మంచం కింద నుంచి గురక శబ్దం వస్తుండడంతో మేల్కొన్న వెంకటరెడ్డి మంచం కింద చూడగా దొంగ నిద్రపోతున్నాడు. వెంటనే కుటుంబసభ్యులను తీసుకుని బయటకు వెళ్లి ఇంటి బయట గడియ పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి మంచం కింద నిద్రపోతున్న దొంగను బయటకు లాగారు. మంక్కీ క్యాప్‌ తీసి చూడగా దొంగ సూరిబాబు అని తేలింది.

డబ్బులు అత్యవసరమవడంతో దొంగతనానికి వచ్చానని సూరిబాబు చెబుతున్నాడు. వెంకటరెడ్డి పెట్రోల్ బంక్‌ డబ్బులతో రోజు ఇంటికి వెళ్తాడని తెలుసుకుని దొంగతనానికి వచ్చానని పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.