చిరంజీవి గుండు వీడియో వైరల్

ఆమధ్య సడెన్ గా గుండుతో దర్శనమిచ్చారు చిరంజీవి. అంతా షాక్ అయ్యారు. ఉన్నఫలంగా చిరంజీవి గుండు చేయించుకోవడం ఏంటని అవాక్కయ్యారు. కొంతమంది దాన్ని కొత్త సినిమా గెటప్ అన్నారు. మరికొంతమంది ఏదో మొక్కు అన్నారు. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్లు చెప్పుకున్నారు. అలా ఎన్నో ఊహాగానాలకు ఊతమిచ్చిన చిరంజీవి, ఎట్టకేలకు తన గుండు గుట్టు విప్పారు. ఏకంగా వీడియో రిలీజ్ చేశారు.

నిజానికి చిరంజీవి గుండు కొట్టించుకోలేదు. గుండులో తననుతాను చూసుకోవాలని ఉబలాటపడ్డారు. అందుకే ప్రోస్తెటిక్స్ మేకప్ వేయించుకున్నారు. ముంబయికి చెందిన మేకప్ టీమ్, చిరంజీవికి ఇలా గుండు మేకప్ వేసింది.

నిజానికి వీళ్లు చిరంజీవికి మేకప్ వేయడం కోసం హైదరాబాద్ రాలేదు. బిగ్ బాస్ కార్యక్రమంలో నాగార్జునను ముసలి గెటప్ లో చూపించడం కోసం వచ్చారు. వీళ్ల పనితీరు నచ్చి, చిరంజీవి కూడా ఇలా సరదాగా గుండు మేకప్ వేయించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.