కోవిడ్ 19 చికిత్స… మళ్లీ ఓ కొత్త మాట !

‘కరోనా గురించి ఇప్పుడు డాక్టర్లకు బాగా అర్థమైంది…. కాబట్టి సరైన చికిత్స అందించగలుగుతున్నారు’… అనే మాటలు అప్పుడప్పుడు వింటున్నాం. అయితే ఇదే సమయంలో దీనిపై జరుగుతున్న అధ్యయనాల్లో మరిన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దీని చికిత్సపై సందేహాలను లేవనెత్తుతున్నాయి. నెదర్ ల్యాండ్స్ లో నిర్వహించిన ఓ అధ్యయనం… కోవిడ్ 19 చికిత్సలో డాక్టర్లు అనుసరిస్తున్న ఓ విధానం సరికాదంటోంది.

సాధారణంగా కరోనా సోకిన తరువాత మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ స్పందించి వైరస్ పైన పోరాటం చేస్తుందన్న సంగతి తెలిసిందే. అదే రోగనిరోధక వ్యవస్థ అత్యంత తీవ్రంగా ప్రతిచర్య జరిపినప్పుడు… దానిని సైటోకిన్ తుఫానుగా భావిస్తారు. అంటే రోగనిరోధక వ్యవస్థ అవసరానికి మించి స్పందించడం అన్నమాట. ఇలాంటప్పుడే మరణాలు సంభవిస్తున్నాయనేది వైద్యులు చెబుతున్న మాట. అంటే మన రోగనిరోధక వ్యవస్థే మనకు హాని చేసే స్థితి. దీనిని తప్పించడానికి కోవిడ్ 19 లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి యాంటీ సైటోకిన్ చికిత్స సరైన ట్రీట్ మెంట్ అని వైద్యులు భావిస్తున్నారు. ఇది నూరుశాతం కరెక్టే అని చెప్పలేకపోతున్నా… ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు యాంటీ సైటోకిన్ చికిత్సని కోవిడ్ 19 పేషంట్లకు అందిస్తున్నారు.

అయితే ప్రస్తుత అధ్యయనంలో… కోవిడ్ 19 పేషంట్లలో కనిపిస్తున్న సైటోకిన్ తుఫాను… అనేది ఇతర తీవ్ర అనారోగ్యాల్లో కనిపించే సైటోకిన్ తుఫాను అంత తీవ్రంగా లేదని తేలింది.

కోవిడ్ 19 కారణంగా సైటోకిన్ తుఫానుకి గురయిన పేషంట్ల పరిస్థితిని… బ్యాక్టీరియా కారణంగా సెప్టిక్ అవటం, గుండెపోటు, తీవ్రమైన గాయాలు లాంటి అనారోగ్యాలకు గురయిన పేషంట్లలో కనబడుతున్న సైటోకిన్ తుఫానుతో పోల్చి చూశారు. సైటోకిన్స్ హఠాత్తుగా పెరిగిపోవటం వలన పేషంటు గురయ్యే సెప్టిక్ షాక్ అనే పరిస్థితితో పోల్చినప్పుడు కోవిడ్ 19 పేషంట్లలో సైటోకిన్లు చాలా తక్కువ స్థాయిలో ఉండటం గమనించారు.

అంతకంటే ఎక్కువగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరచిన విషయం ఏమిటంటే… కోవిడ్ 19 తీవ్రంగా ఉన్న పేషంట్లలో ఉన్న సైటోకిన్ల స్థాయి గుండెపోటు, గాయాలు తదితర కారణాల వలన ఐసియులో ఉన్నవారిలో ఉండే సైటోకిన్ల స్థాయిలో మాత్రమే  ఉంది. మాత్రమే అని ఎందుకంటున్నామంటే… గుండెపోటు, గాయాల వంటివి సైటోకిన్ల తుఫానుకి కారణమయ్యే పరిస్థితులు కాదు.

దీనిని బట్టి కోవిడ్ 19 తీవ్రంగా ఉన్న పేషంట్లకు సైటోకిన్లు పెరిగిపోకుండా చూడటం, వాటిని అణచివేయటం లాంటి చికిత్సలు అంటే యాంటీ సైటోకిన్ థెరపీలు పనికిరావని శాస్త్రవేత్తలు అంటున్నారు. కొన్ని నెలలుగా… కోవిడ్ 19 తీవ్రంగా ఉన్నపుడు సైటోకిన్ల మితిమీరిన పెరుగుదలను ఆపడమే ప్రధాన చికిత్స అని భావిస్తున్న వైద్యులు… మరోసారి తమ చికిత్సా విధానం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.