రూపు మార్చుకుంటున్న అమరావతి…

ఏసీబీ కేసు నమోదు చేయడం, సీబీఐ విచారణకోసం వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టడంతో అమరావతి కథలో పూర్తిగా మార్పులు వచ్చేశాయి. అమరావతిని రాజధాని ప్రాంతంగా ఇన్నాళ్లూ గుర్తించిన ఏపీ ప్రజలు.. రాష్ట్రంలో భూకుంభకోణం జరిగిన ప్రాంతంగా ఇకపై గుర్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి.

అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే అమరావతి కుంభకోణాన్ని సాక్ష్యధారాలతో సహా బైటపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఎవరెవరికి ఎన్ని ఎకరాలున్నాయి, ఏయే బినామీలకు ఎంత వాటాలున్నాయనే విషయాన్ని రిజిస్ట్రేషన్ నెంబర్లతో సహా బైటపెట్టారు బుగ్గన. అప్పట్లో వైరిపక్షాల ఆరోపణలుగా వీటిని కొట్టిపారేశారు చంద్రబాబు.

మూడు రాజధానుల ప్రకటన రాగానే.. రైతుల్ని రెచ్చగొట్టి, తాను జోలెపట్టి.. పెద్ద సీన్ క్రియేట్ చేశారు. కానీ ఆయన వ్యూహాలేవీ ఫలించలేదు.

తాజాగా భూ కుంభకోణం వ్యవహారం మొత్తం బయటకు వస్తుండటంతో బాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆఖరికి ప్రభుత్వం తరపున కోర్టులో వాదించే అడ్వొకేట్ జనరల్ కి కూడా అమరావతి మసి అంటుకుంది అంటే.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయిలో అవినీతికి పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు.

ఫలానా చోట రాజధాని వస్తుంది అని చంద్రబాబు ఉప్పందించకుండానే దమ్మాలపాటి వంటి లాయర్ 41ఎకరాలు రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేస్తారా? పోనీ ఏసీబీ కేసు నమోదు చేస్తోంది అని తెలియగానే.. గుమ్మడికాయల దొంగలాగా నన్ను అరెస్ట్ నుంచి మినహాయించండి అంటూ కోర్టుమెట్లెక్కుతారా? ఒక లాయర్ 41 ఎకరాలు కొన్నారంటే.. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి బినామీలు రాజధానిలో సామాన్యుడికి గజం భూమిని అయినా మిగిల్చారు అనుకోవడం అర్థరహితం.

రాజధాని ప్రకటన వచ్చే ముందే.. భూమి బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలందరి దగ్గర్నుంచి నయానో, భయానో.. భూములు లాగేసుకుంది చంద్రబాబు టీమ్. పేదలకు ఇళ్లు లేని రాజధాని ఏవిధంగా ప్రజా రాజధాని అవుతుంది అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించడంలో తప్పేముంది. పేదలందర్నీ బయటకు తరిమేసి, పెద్దలంతా మేసేయాలనుకునే రాజధాని అమరావతిగా ఫిక్స్ చేసుకున్నారు. మంత్రివర్గ ఉపసంఘం తేల్చిన విషయాన్ని, సిట్ కూడా తమ దర్యాప్తులో నిర్థారించింది. ఇప్పుడు ఏసీబీ కేసు నమోదైంది.

ఇకపై సీబీఐ దర్యాప్తు ప్రారంభం అయితే.. బాబుతో సహా ఆయన బినామీలంతా ఇబ్బందులు పడడం ఖాయం. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై రాజధాని ప్రాంత రైతుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. అవినీతి జరిగితే జరిగింది మా రాజధాని మాకు కావాలి అంటారా? లేక ముందు టీడీపీ అక్రమాలపై విచారణ జరిపించండి, ఎవరి భూములు వారికి తిరిగి ఇప్పించండి అని కోరతారా? వేచి చూడాలి. మెల్లమెల్లగా అమరావతి వ్యవహారం రసకందాయంలో పడింది. రాజధాని ప్రాంతం కాస్తా… ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిన ప్రాంతంగా వార్తల్లోకెక్కుతోంది.