సీఎంకు నోటీసులిచ్చేందుకు నో…

అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన కేసుదర్యాప్తుపై హైకోర్టు స్టే ఇచ్చింది. దాంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మందికి ఊరట లభించింది. ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలను ప్రచారం చేయవద్దని కూడా మీడియాపై, సోషల్ మీడియాపైనా హైకోర్టు ఆంక్షలు విధించింది.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ఈసారి హైకోర్టు అంగీకరించలేదు. హైకోర్టులో పిటిషన్‌ వేసిన దమ్మాలపాటి శ్రీనివాస్‌ వ్యక్తిగత హోదాలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని కూడా ప్రతివాదిగా చేర్చాలని కోరారు. ప్రతీకేసులోనూ ముఖ్యమంత్రిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడం ఫ్యాషన్ అయిపోయిందని అడ్వకేట్ జనరల్ అభ్యంతరం తెలిపారు. దాంతో న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి తాను ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని ప్రతివాదిగా చేర్చడం లేదని… ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం లేదని వివరించారు.

ఇదే హైకోర్టు కొద్దిరోజుల క్రితం అమరావతి రైతుల కేసు విచారణ సందర్భంగా మాత్రం జగన్‌మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈసారి మాత్రం హైకోర్టు జగన్‌మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ఇష్టపడలేదు.