సుశాంత్ ఇంట్లో ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్ మాయం

సుశాంత్ కేసు రోజురోజుకు కొత్త మలుపు తీసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో డ్రగ్స్ కోణం బయటపడగా.. సుశాంత్ ది ఆత్మహత్య కాదు, హత్య అని వాదించేవారు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి సుశాంత్ బెస్ట్ ఫ్రెండ్ సిద్దార్థ్ పితానీ కూడా చేరాడు. సుశాంత్ ది ముమ్మాటికీ హత్యే అంటున్నాడు సిద్దార్థ్.

సీబీఐ విచారణలో భాగంగా మరో కీలక విషయాన్ని వెల్లడించాడు సిద్దార్థ్. సుశాంత్ చనిపోయిన తర్వాత అతడి ఫ్లాట్ నుంచి ఓ ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్ మాయమయ్యాయని.. వాటిని రియానే తీసుకెళ్లి ఉంటుందని సీబీఐకి వెల్లడించాడు. అంతేకాదు.. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు తనకు థ్రెట్ ఉందని, తనను చంపేస్తారంటూ సుశాంత్ కొన్ని సందర్భాల్లో తనకు చెప్పిన విషయాన్ని సిద్దార్థ్ బయటపెట్టాడు. ఈ క్రమంలో తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని పెంచుకోవడానికి కూడా సుశాంత్ ప్రయత్నించాడని చెబుతున్నాడు.

ఇక డ్రగ్స్ కోణానికి సంబంధించి.. మాదకద్రవ్యాలు తీసుకుంటే జీవితంలో అనుకున్నది సాధించలేమనే విషయాన్ని సుశాంత్ తనకు చాలా సందర్భాల్లో చెప్పేవాడని, అలాంటి వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడంటే తను నమ్మనని చెబుతున్నాడు. కేవలం ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకే డ్రగ్స్ కోణాన్ని బయటకు తీశారని ఆరోపిస్తున్నాడు.

మరోవైపు సుశాంత్ మాజీ మేనేజర్ కూడా దాదాపు ఇవే విషయాల్ని సీబీఐ విచారణలో బయటపెట్టాడు. సుశాంత్ ది ఆత్మహత్య కాదని ఈయన వాదిస్తున్నాడు.