ఏపీలో శాసనవ్యవస్థను న్యాయవ్యవస్థ స్వాధీనం చేసుకున్నట్టు వ్యవహరిస్తోంది – విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ధర్మాన్ని కాపాడాల్సిన న్యాయవ్యవస్థే పక్షపాతధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

అమరావతి భూకుంభకోణం, ఫైబర్ గ్రిడ్ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఏ తీర్పునైనా లాజికల్‌గా విమర్శిస్తే తప్పు లేదని చట్టమే చెబుతోందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఏపీలోని రాజకీయ, న్యాయవ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసన్నారు. 2010 నుంచి 2019 వరకు ఏ న్యాయసూత్రాలను అనుసరించారో… ఇప్పుడు అవే న్యాయసూత్రాలను వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టులు ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు.

2011-12లో తమను అరెస్ట్ చేసినప్పుడు మీడియాపై గొంతు నొక్కుడు ఆర్డర్స్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. చట్టం అన్నది ప్రధానికి, న్యాయమూర్తులకు, సామాన్యులకూ అందరికీ సమానమేనన్నారు. కానీ ఏపీ న్యాయవ్యవస్థ మాత్రం ఎందుకు పక్షపాతంగా వ్యవహరిస్తోంది అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు గాగ్‌ ఆర్డర్స్‌ ప్రభుత్వాల నుంచి వచ్చేవని… ఇప్పుడు మాత్రం న్యాయవ్యవస్థే నేరుగా మీడియా గొంతు నొక్కుతోందని… ఇలా ఎందుకు చేశారో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు.

అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే గొంతు నొక్కుడు ఆదేశాలు ఇస్తుంటారని.. కానీ గత ఏడాదిన్నర నుంచి ఇంచుమించు ప్రభుత్వం న్యాయవ్యవస్థ చేతిల్లో ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. శాసనవ్యవస్థను ఏపీలో న్యాయవ్యవస్థే స్వాధీనం చేసుకుందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఇది న్యాయవ్యవస్థ హద్దులు దాటడం కాదా అని నిలదీశారు.

పౌరుల ప్రాథమిక హక్కులను ఏ నేరస్తులో ఉల్లంఘిస్తే అర్థం చేసుకోవచ్చని… కానీ ఎవరైతే న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడేందుకు తీర్పులు ఇవ్వాలో వారే ఇలాంటి తీర్పులు ఇస్తే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంటుందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

ఏపీలో ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదలనివ్వడం లేదని, ఒక జీవో వచ్చిన వెంటనే స్టే ఇస్తున్నారని… ప్రజాక్షేమం కోరి నిర్ణయం తీసుకున్నా స్టేలు ఇచ్చేస్తున్నారన్నారు. అదే ఏడాదిన్నర ముందు గత ప్రభుత్వం ఎంత చట్టవిరుద్దంగా పనిచేసినా నాడు మాత్రం మాట్లాడలేదన్నారు. న్యాయవ్యవస్థ తప్పుదారి పట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజయసాయిరెడ్డి కోరారు. ఒక్క న్యాయవ్యవస్థ మాత్రమే పనిచేస్తోందా… శాసనవ్యవస్థ పనిచేయడం లేదా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. జ్యుడిషియరీ ఓవర్‌ రీచ్ అన్నది జరుగుతోందని చాలా ఏళ్లుగా చర్చ జరుగుతూ ఉందన్నారు.

ఏపీలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్రపతి, ప్రధానిని కలిసి వివరిస్తామని మిథున్ రెడ్డి చెప్పారు. న్యాయవ్యవస్థలో కొందరు అన్యాయంగా ఉన్నారని అందుకే ఇబ్బందులు వస్తున్నాయన్నారు. కుంభకోణాలు జరిగితే వెలికితీయండి అని చెప్పాల్సిన కోర్టులు… వాటిపై దర్యాప్తును అడ్డుకోవడం ఏమిటి అని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ఏదైనా మాట్లాడే హక్కు, చర్చించే హక్కు , అధికారం ఎంపీలుగా తమకు ఉందన్నారు.