కోవిడ్ వచ్చిందని భార్యకు చెప్పి… ప్రియురాలితో చెక్కేశాడు !

కోవిడ్ బాధలతో పాటు కరోనా వింతలు విచిత్రాలు  సైతం ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ముంబయిలో అలాంటి వింత ఘటన ఒకటి జరిగింది. తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని, ఇక తాను బతకనని భార్యకు ఫోన్ చేసి కనిపించకుండా పోయాడు ఓ 28ఏళ్ల  యువకుడు. అతని మాటలకు విస్తుపోయిన భార్య… తిరిగి మాట్లాడేలోపునే  ఫోన్ కట్ చేశాడు. ఏం చేయాలో తోచని ఆ భార్య తన అన్న సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు యువకుని వెతికే ప్రయత్నాలు చేయగా అతని బైక్, హెల్మెట్, బ్యాగు, కీస్ వగైరాలు… విషీస్ సెక్టార్ 17 అనే ప్రాంతంలో రోడ్డుపైన కనిపించాయి. అతని ఆచూకీ మాత్రం  లభించలేదు.

పోలీసులు యువకుడు తిరిగిన ప్రదేశాల్లో సిసిటీవీ ఫుటేజ్ గమనించారు, మొబైల్ లోకేషన్ ని ట్రేస్ చేయడానికి  ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. అతను కనిపించకుండా పోయిన రాత్రి రెండుసార్లు 100 నెంబరుకి డయల్ చేయటం పోలీసులు గుర్తించారు. దాంతో అతనికి శత్రువులున్నారా, దొంగతనానికి గురయ్యాడా లాంటి రకరకాల కోణాల్లో ఆలోచించి వెతికారు. అయినా ఫలితం కనిపించలేదు.

అయితే మరింత తీవ్రంగా వెతికే ప్రయత్నాలు చేసినప్పుడు తనకి ఓ యువతితో వివాహేతర సంబంధం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. నెలరోజులపాటు గాలించి  చివరకు ఇండోర్ లో ఉన్నాడని తెలుసుకున్నారు. అక్కడకు వెళ్లిన పోలీసులకు అతను తన ప్రియురాలితో కనిపించాడు. ఎట్టకేలకు… కరోనా పేరుతో భార్యకు టోకరా ఇచ్చిన అతగాణ్ణి పోలీసులు తిరిగి భార్య వద్దకు… ముంబయికి తీసుకువచ్చారు.