షూటింగ్ అప్ డేట్స్ (సెప్టెంబర్ 18)

హీరోలంతా ఇప్పుడిప్పుడే సెట్స్ పైకి వస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో మరోసారి షూటింగ్ సందడి నెలకొంది. ప్రస్తుతం ఏఏ సినిమా ఎక్కడ షూటింగ్ జరుపుకుంటోంది, ఏ స్టేజ్ లో ఉందనే విషయాన్ని ఓసారి చూద్దాం.

లవ్ స్టోరీ

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య-సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా లవ్ స్టోరీ. ఈ మూవీకి సంబంధించి ఆఖరి షెడ్యూల్ మొదలైంది. ఈ నెలాఖరుకు ఈ షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కుదిరితే డిసెంబర్ లో కుదరకపోతే జనవరిలో లవ్ స్టోరీ థియేటర్లలోకి వస్తుంది.

నాగశౌర్య కొత్త సినిమా

నాగశౌర్య తన కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. ఈ మూవీ కోసమే సిక్స్ ప్యాక్ లోకి మారాడు శౌర్య. సినిమాలో అతడు విలుకారుడిగా కనిపించబోతున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకు నారాయణ్ దాస్ నారంగ్ , రామ్మోహన్ రావు నిర్మాతలు.

వైల్డ్ డాగ్

అక్కినేని కుటుంబం నుంచి ముందుగా సెట్స్ పైకి వచ్చిన వ్యక్తి నాగార్జున. తను చేస్తున్న వైల్డ్ డాగ్ సినిమాకు సంబంధించి ఆఖరి షెడ్యూల్ ను అన్నపూర్ణ స్టుడియోస్ లో స్టార్ట్ చేశాడు నాగ్. అహితోష్ సోలమన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున స్పెషల్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాను డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఇచ్చేస్తారనే టాక్ నడుస్తోంది.

క్రిష్-వైష్ణవ్ తేజ్ మూవీ

లాక్ డౌన్ లోనే మొదలుపెట్టి, లాక్ డౌన్ లోనే పూర్తిచేయాలనే టార్గెట్ తో ప్రారంభమైంది క్రిష్ కొత్త సినిమా. వైష్ణవ్ తేజ్, రకుల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అటవీ ప్రాంతంలో కొనసాగుతోంది. 30 రోజుల షెడ్యూల్ తర్వాత యూనిట్ నల్లమలకు షిఫ్ట్ అవుతుంది. అక్కడ మరో 10 రోజుల షెడ్యూల్ పూర్తిచేస్తే, టోటల్ మూవీ రెడీ అయిపోతుంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

అఖిల్-పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ కూడా సెట్స్ పైకి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనేది ప్లాన్.

నాంది

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న నాంది మూవీ షూట్ మళ్ళీ మొదలైంది. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీ లో అల్లరి నరేష్ తో పాటు మిగతా నటీనటులపై సీన్స్ తీస్తున్నారు. ఈ షెడ్యుల్ తో టోటల్ షూట్ పూర్తవుతుంది. విజయ్ కనకమేడల డైరెక్షన్ లో సస్పెన్స్ క్రైం డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. త్వరలోనే షూట్ ఫినిష్ చేసి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు.