చెక్కుల వ్యవహారంపై ఏసీబీ విచారణకు సీఎం ఆదేశం

నకిలీ చెక్కుల వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఏసీబీ విచారణకు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఏసీబీ డైరెక్టర్‌కు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు.

ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఏకంగా 117 కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు ప్రయత్నించారు. బ్యాంకు అధికారులు అప్రమత్తం కావడంతో పన్నాగం బెడిసికొట్టింది. ఏపీ సీఎంఆర్‌ఎఫ్‌ జారీ చేసిందంటూ 52 కోట్ల 65 లక్షల రూపాయల విలువైన ఎస్‌బీఐ చెక్‌ను కర్నాటక మంగళూరులోని బ్రాంచ్‌ నుంచి డ్రా చేసేందుకు శుక్రవారం కొందరు ప్రయత్నించారు. చెక్ ఏకంగా 52 కోట్ల రూపాయలకు సంబంధించినది కావడంతో వెలగపూడిలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌కు మంగళూరులోని బ్రాంచ్ అధికారులు ఫోన్ చేశారు. ఇక్కడి బ్యాంకు అధికారులు సీఎంఆర్‌ఎఫ్ అధికారులను ఆరా తీశారు. తాము అంత మొత్తంతో చెక్‌ ఇవ్వలేదని సీఎంఆర్‌ఎఫ్‌ అధికారులు తేల్చేశారు.

ఇంతలో ఢిల్లీలోని ఒక ఎస్‌బీఐ బ్యాంకు వద్దకు ఇదే తరహాలో 39 కోట్ల 85 లక్షల రూపాయల విలువైన చెక్ వచ్చింది. ఆ బ్యాంకు అధికారులు కూడా వెలగపూడి బ్రాంచ్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. అది కూడా సీఎంఆర్‌ఎఫ్ అధికారులు జారీ చేయలేదని తేలింది. ఇదే తరహాలోనే కోల్‌కతాలోని ఒక ఎస్‌బీఐ బ్రాంచ్‌కు 24 కోట్ల 65 లక్షల రూపాయల చెక్ వెళ్లింది. భారీ మొత్తానికి సంబంధించిన చెక్‌లు కావడంతో బ్యాంకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ వ్యవహారం బెడిసికొట్టింది.