పుట్టబోయేది పాపో బాబో తెలుసుకోవాలని…

ఉత్తర ప్రదేశ్ లో అత్యంత దారుణానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. కడుపుతో ఉన్న భార్య పట్ల అమానవీయంగా ప్రవర్తించాడు. పుట్టబోయేది ఆడో మగో తెలుసుకునేందుకు పదునైన ఆయుధంతో ఆమె పొట్టని చీల్చి తీవ్రంగా గాయపరిచాడు.

బరేలీ జిల్లాలోని  నెక్ పూర్ అనే ప్రాంతానికి చెందిన పన్నాలాల్ కు అయిదుగురు కూతుళ్లు ఉండగా అతని భార్య ఆరోసారి గర్భం దాల్చింది. అయితే మగపిల్లవాడు కావాలనే ఆశతో ఉన్న పన్నాలాల్ ఈసారయినా మగపిల్లవాడు పుడతాడా లేదా అనే ఆత్రుతతో…ఆ విషయం తెలుసుకోవాలనే కోరికతో విచక్షణ మర్చిపోయి అత్యంత పాశవికంగా పదునైన ఆయుధంతో భార్య పొట్టని చీల్చాడు. దాంతో ఆమె తీవ్రంగా గాయపడింది. చుట్టుపక్కల ఉన్నవారు ఆమెని జిల్లా హాస్పటల్ కి తీసుకువెళ్లగా… పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారటంతో మెరుగైన చికిత్స కోసం బరేలీ హాస్పటల్ కి మార్చారు.

పోలీసులు పన్నాలాల్ ని అరెస్టు చేశారు. అతను ఇలాంటి పని చేయటం వెనుక ఉన్న కారణాలను విచారిస్తున్నామని వారు తెలిపారు. 35సంవత్సరాల వయసున్న పన్నాలాల్ భార్య ఆరు నెలల గర్భవతి అని పోలీసులు వెల్లడించారు.