గుర్తు కోసం చంద్రబాబు జయపద్రంగా చేసింది అందరికీ తెలుసు – వంశీ

తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ తెలుగుదేశంపార్టీ మూతపడబోతోందని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పారు. మూతపడే పార్టీలో ఉండాలని ఎమ్మెల్యేలు ఎందుకు అనుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ గతం చాలా గొప్పదేనని కానీ భవిష్యత్తు మాత్రం లేదన్నారు. ఇందుకు కారణం చంద్రబాబు, నారా లోకేషేనన్నారు. తెలంగాణ టీడీపీని ముంచిన తరహాలోనే ఏపీ టీడీపీని కూడా నట్టేట ముంచేస్తారని… వీరిని నమ్ముకున్న వారు రాజకీయంగా పూర్తిగా మునిగిపోతారన్నారు.

ఆ విషయం తెలిసే ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వస్తున్నారన్నారు. చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను చేర్చుకుని… అందులో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని అది తప్పు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తే సంసారం ఎదుటి వారుచేస్తే వ్యభిచారామా అని ప్రశ్నించారు. చంద్రబాబు వాస్తవం చెబితే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందన్నారు.

చంద్రబాబుకు 72 ఏళ్లు వచ్చాయని… ఆ వయసు వచ్చాక ఎవరికైనా ఇబ్బందేనని… చంద్రబాబు తర్వాత పార్టీని నడిపే వారు ఎవరు అని ప్రశ్నించారు. లోకేష్‌ పార్టీ తీసుకుంటే అది మునిగిపోతుందన్నారు. గతంలో కేసీఆర్‌, హరీష్‌ రావు లాంటి వారు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌ను అద్దెకు ఇచ్చుకోవాలని అంటే బాధపడేవారిమని… కానీ ఇప్పుడు అదే పరిస్థితి నిజమైందన్నారు. కారణం చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.

రాజకీయాల్లో పోరాటం చేసే వాడు నిలబడుతాడు కానీ… పారిపోయేవాడికి అవకాశం ఉండదన్నారు. ఓటుకునోటుకు భయపడి తెలంగాణ నుంచి పారిపోయి వచ్చి టీటీడీపీని ముంచేశారని… ఇప్పుడు ఏపీలో కేసులు పెడతారని భయపడి హైదరాబాద్‌లో దాక్కున్నారని వంశీ విమర్శించారు. ఏపీకి రాకుండా కరోనా అంటూ జూమ్‌లో కబుర్లు చెబుతున్నారన్నారు.

ఈ దేశంలో ఏమాత్రం విశ్వసనీయత లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమేనన్నారు. ఎన్టీఆర్‌ బీఫాం ఇస్తే గెలిచిన ఎమ్మెల్యేలను లాక్కున్న తర్వాత చంద్రబాబు ఎన్నికలకు వెళ్లారా అని ప్రశ్నించారు. జగన్‌మోహన్ రెడ్డి తమను పార్టీలో చేర్చుకోలేదని, కండువా కప్పలేదని… తామే అధికార పక్షానికి సంఘీభావంగా ఉంటామని ముందుకొచ్చామని వంశీ చెప్పారు.

జగన్‌మోహన్ రెడ్డి అంగీకరిస్తే మరింత మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీకి ఎన్టీఆర్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అయితే… చంద్రబాబు భూస్థాపిత అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. పార్టీ గుర్తును సొంతం చేసుకునేందుకు చంద్రబాబు జయపద్రంగా చేసిన పనులు అందరికీ తెలుసన్నారు. పోలవరం చూపిస్తానంటూ 400 కోట్లు కాజేసిన వ్యక్తి చంద్రబాబు అని వంశీ విమర్శించారు.