బాబూ లోకేష్… నువ్వింతకంటే ఎదగవా…?

కొడుకు లోకేష్ ని తనకి మించిన స్థాయిలో చూడాలనేది చంద్రబాబు ఆలోచన. దానికి తగ్గట్టే విదేశాల్లో చదివించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశారు, ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. తెలుగు ట్యూషన్, పర్సనాలిటీ డెవలప్ మెంట్ క్లాసులు.. ఇవన్నీ వాటికి అదనం.

ఇంత చేసినా నారా లోకేష్ మాత్రం ఎందుకో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడంలో ఎప్పూడూ ఫెయిలవుతూనే ఉన్నారు. బాబు దగ్గర ఉన్న రాజకీయ చతురత కానీ, చాణక్యం కానీ ఏవీ లోకేష్ కి అబ్బలేదంటే టీడీపీ శ్రేణులు కూడా కాదనవు.

ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేతను విమర్శించాలంటే.. సమస్యలు గుర్తించాలి, విషయ సేకరణ చేయాలి, వివరాలు రాబట్టాలి. ఒక స్టేట్ మెంట్ ఇస్తే అవతలి వాళ్లు నిజమే కాబోలు అనుకునేలా ఉండాలి. మరి లోకేష్ ఏం చేస్తున్నారు. ప్రజల ముందు నోరు తెరిస్తే తప్పులు దొర్లుతున్నాయని, తనకు అనుకూలమైన ట్విట్టర్ ని ఎంపిక చేసుకున్నారు.

అంతవరకు బాగానే ఉంది కానీ ఆ ట్విట్టర్ లో లోకేష్ పోస్టింగ్ లు చూస్తుంటే.. ఇంతకంటే లోకేష్ ఇక ఎదగడేమో అనిపిస్తోంది.

తాజాగా లోకేష్ ఓ ట్వీట్ పెట్టారు. రేణిగుంట విమానాశ్రయంలో తనని కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని సీఎం జగన్.. మాస్క్ ఎందుకయ్యా అని వారించే సందర్భం అది. అప్పటికే మధుసూదన్ రెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. అలాంటి కరోనా విజేతను దగ్గరకు తీసుకుని భుజంపై చెయ్యివేసి అభినందించిన జగన్ తెగువని అక్కడ చూడాలా? లేక ఫొటో దిగేటప్పుడు కూడా మాస్క్ ఎందుకు అన్నందుకు ఆయనది మూర్ఖత్వం అనుకోవాలా? లోకేష్ మాత్రం జగన్ ది మూర్ఖత్వమేనంటున్నారు.

కరోనాకి భయపడి తండ్రీ కొడుకులం మేమిద్దరం.. రాష్ట్రానికి దూరంగా హైదరాబాద్ లో వనవాసం గడుపుతుంటే.. సీఎం జగన్ జనంలో తిరగడం ఏంటి అనేది లోకేష్ అక్కసు. అందుకే జగన్ మాస్క్ వేసుకోరు, వేసుకోనివ్వరు అంటూ ఓ ట్వీట్ పెట్టి సంబరపడ్డారు. తానేదో అంతర్జాతీయ స్కామ్ బైటపెట్టినట్టు, తన ట్వీట్ తో జగన్ ని ఇబ్బంది పెట్టినట్టు, వైసీపీ ప్రభుత్వానికి చెమటలు పట్టించినట్టు జబ్బలు చరుచుకున్నారు.

అసలింతకీ లోకేష్ సమస్య ఏంటి? ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ఇంతకంటే కొత్త పాయింట్ ఏదీ లోకేష్ కి దొరకలేదా? భావి నాయకుడు అని టీడీపీ శ్రేణులు గొప్పలు చెప్పుకుంటున్న లోకేష్.. ఇలాంటి ట్వీట్లతో కాలం గడిపేస్తారా? నిజంగానే టీడీపీ పగ్గాలు చేపట్టే సత్తా ఆయనలో ఉందా? సీఎం జగన్ మాస్క్ వేసుకోలేదు, అదిగో కాసేపు తీసేశారు, ఇదిగో ఇక్కడ ఎన్-95 రకం మాస్క్ వాడలేదు.. అంటూ చిన్న చిన్న విషయాలను హైలెట్ చేసుకుంటూ పోతే.. ఎప్పటికీ లోకేష్ ట్విట్టర్ కే పరిమితం కావాల్సి ఉంటుంది.