హీరోను వదిలేసి విలన్ కు సన్మానం…

అదొక తెలుగు సినిమా సెట్. హీరో అక్కడే ఉన్నాడు. సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టు కూడా సెట్స్ లో ఉన్నాడు. డైరక్టర్ తో పాటు హీరోయిన్ కూడా ఉంది. అదే టైమ్ లో సెట్స్ లోకి విలన్ ఎంటరయ్యాడు. అంతే, ఒక్కసారిగా అంతా లేచి చప్పట్లు కొట్టారు. ఏకంగా అతడికి సన్మానం చేశారు. ఆ విలన్ పేరు సోనూ సూద్. అల్లుడు అదుర్స్ సినిమా సెట్ లో జరిగిన ఘటన ఇది.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రకాష్ రాజ్ తో పాటు బ్రహ్మాజీ, శ్రీనివాసరెడ్డి లాంటి నటులంతా ఉన్నారు. వీళ్లంతా కలిసి రియల్ హీరో సోనూ సూద్ కు సన్మానం చేశారు.

లాక్ డౌన్ కు ముందు వరకు సోనూసూద్ అంటే టాలీవుడ్ విలన్. కానీ ఇప్పుడతడు ఆలిండియా లెవెల్లో హీరో. లాక్ డౌన్ టైమ్ లో సోనూ చేసిన సేవా కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

సొంత ఖర్చుతో లక్షలాది మందికి సహాయం చేశాడు సోనూ భాయ్. దేశమంతా మెచ్చుకునేలా, అందరూ గర్వపడేలా ఛారిటీ కార్యక్రమాలు నిర్వహించాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు హైదరాబాద్ వచ్చాడు. సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. దీంతో “అల్లుడు అదుర్స్” యూనిట్ చిన్నపాటి సెలబ్రేషన్ చేసింది. సెట్స్ లోనే ఉన్న ప్రకాష్ రాజ్, అతడికి సన్మానం చేశాడు. అలా విలన్ పాత్ర చేయడానికొచ్చిన సోనూ.. సెట్స్ లో హీరోగా మారాడు.