ప్రధానికి వైఎస్‌ జగన్‌ లేఖ

ప్రధాని నరేంద్రమోడీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి లేఖ రాశారు. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విషయంలో ప్రధానికి లేఖ రాశారు. ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వాల్సిందిగా లేఖలో ప్రధానిని జగన్‌మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే బాలసుబ్రమణ్యంకు భారతరత్న ఇవ్వాలని పలువురు ప్రముఖులు కూడా డిమాండ్ చేశారు. ఎస్పీ బాలసుబ్రమణ్యంకు భారతరత్న ఇవ్వాల్సిందేనని నటుడు అర్జున్‌ ఇది వరకే కోరారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు.

అటు ఆస్పత్రి బిల్లులపై జరుగుతున్న ప్రచారాన్ని బాలు కుమారుడు ఎస్పీ చరణ్ ఖండించారు. వైద్యం అందించిన ఎంజీఎం ఆస్పత్రి బాలు కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టిందని… మూడు కోట్లు బిల్లు చేసిందని… డబ్బు మొత్తం చెల్లించే వరకు భౌతిక కాయాన్ని ఇవ్వలేదని… చివరకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె ఆస్పత్రి బిల్లు చెల్లించడంతో సమస్య పరిష్కారం అయిందంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

ఈ ప్రచారాన్ని ఎస్పీ చరణ్ ఖండించారు. ఇలాంటి పుకార్లు ఎవరు సృష్టిస్తారో అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి ప్రచారాన్నిఖచ్చితంగా బాలు అభిమానులు చేసి ఉండరని అభిప్రాయపడ్డారు.

ఎంజీఎం ఆస్పత్రి తన తండ్రి ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నదని, డబ్బుల విషయంలో మమ్మల్ని ఎలాంటి ఇబ్బందీ పెట్టలేదని పేర్కొన్నారు. ఆస్పత్రి వర్గాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.

వెంకయ్య నాయుడు కుమార్తె దీప కూడా ఈ ప్రచారాన్ని ఖండించింది. ఆస్పత్రికి తాము ఎలాంటి బిల్లులూ చెల్లించలేదని చెప్పింది.