ఆంధ్రజ్యోతికి లీగల్‌ నోటీసులు

ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి… కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీపై ఆంధ్రజ్యోతి పత్రిక భిన్నమైన కథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక ఏపీ ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసేలా, ఆయనకు అమిత్ షా క్లాస్‌ తీసుకున్నారు అంటూ ప్రచురించింది.

ఈ కథనంపై ఆంధ్రజ్యోతికి లీగల్‌ నోటీసులు పంపించింది ప్రభుత్వం. ఈ లీగల్ నోటీసులను ఏపీ సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్‌ రెడ్డి పంపించారు. అసత్య కథనంపై క్షమాపణలు చెప్పాలని లేకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమకు విజయకుమార్‌ రెడ్డి ప్రభుత్వం తరపున లీగల్ నోటీసులు పంపడంపై ఆంధ్రజ్యోతి పత్రిక తీవ్రంగా స్పందించింది.

జగన్‌ వద్ద స్వామి భక్తి చాటుకునేందుకే లీగల్ నోటీసులు ఇచ్చారని విజయ్‌ కుమార్‌ రెడ్డిపై విమర్శలు చేసింది. జగన్‌మోహన్ రెడ్డి, అమిత్ షా మధ్య జరిగింది ఒక రాజకీయ సమావేశమని… కాబట్టి రాజకీయపరమైన వార్తలతో సమాచార కమిషనర్‌కు ఏం సంబంధం అని ఆ పత్రిక ప్రశ్నించింది. విజయ్ కుమార్ రెడ్డి హద్దులు దాటి వ్యవహరిస్తున్నారని ఆంధ్రజ్యోతి పత్రిక ఆగ్రహం వ్యక్తం చేసింది.