ఏది జరిగినా ఏకాకి పవన్ కల్యాణే….

వైసీపీ ఎన్డీఏలో చేరుతుందా? చేరితే ఎన్ని మంత్రి పదవులు తీసుకుంటారు? ఒకవేళ బయటినుంచి మద్దతిచ్చి ఊరుకుంటారా? ఇలాంటి సవాలక్ష ఊహాగానాలు వినపడుతున్న సందర్భం ఇది.

జగన్ ఢిల్లీ పర్యటనతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది. అందరూ అనుకుంటున్నట్టు చంద్రబాబు తీవ్ర ఉత్కంఠలోనే ఉన్నారు. అయితే అంతకు మించి ఇబ్బంది పడుతున్న వ్యక్తుల్లో పవన్ కల్యాణ్ మొదటి స్థానంలో ఉంటారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే పవన్ కల్యాణ్ కి సుతరామూ ఇష్టంలేదు. జగన్మోహన్ రెడ్డి అని పూర్తి పేరు పిలవడం కూడా ఆయనకు ఇష్టం లేదంటే.. జగన్ పై పవన్ కు ఎంత జలసీయో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి జగన్.. ఇప్పుడు పవన్ స్నేహం చేస్తున్న బీజేపీతో దోస్తీ కడుతున్నారు. వైసీపీ ఎన్డీఏలో చేరినా, చేరకపోయినా రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధాలు మాత్రం రోజురోజుకీ పటిష్టపడుతున్నాయని చెప్పక తప్పదు. ఆమధ్య కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి జగన్ ని ప్రశంసించడం, ఇటీవల ప్రధాని మోదీ.. ఏపీ సచివాలయ వ్యవస్థను ఆకాశానికెత్తడం చూస్తుంటే.. జగన్ పై వారికి సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు అర్థమవుతోంది.

కేంద్ర నాయకత్వానికున్న అభిప్రాయాన్ని బట్టి రాష్ట్ర నాయకత్వం కూడా మసలుకొంటుంది. అంటే రాష్ట్ర బీజేపీ కూడా జగన్ ని కానీ, జగన్ పథకాల్ని కానీ ఏకపక్షంగా విమర్శించే సాహసం చేయదు. ఇప్పుడు సమస్యల్లా పవన్ కల్యాణ్ దే. జగన్ ఢిల్లీ పర్యటనతో పవన్ అడకత్తెరలో పోకచెక్కలా మారారు. జగన్ తో బీజేపీ స్నేహం పవన్ కి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రస్తుతానికి సర్దుకుపోవాల్సిందే. ఇప్పటికిప్పుడు ఈ వంకతో పవన్ బీజేపీ కూటమి నుంచి బైటకొచ్చే అవకాశం లేదు. తనకు తాను సీఎం కుర్చీకి గట్టిపోటీగా భావించే పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికల్లోనైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. బీజేపీ, వైసీపీ దోస్తీతో.. రాష్ట్రంలో పరిస్థితులు తారుమారయితే పవన్ ఆశలకు గండిపడ్డట్టే.

అందుకే ఆయన కచ్చితంగా 2024నాటికి ఆ కూటమినుంచి బైటకు రావాల్సిన పరిస్థితి. పవన్ బైటకు రావాలే కానీ ఎరవేసి పట్టుకోడానికి చంద్రబాబు రెడీగా ఉన్నారు. బైటకొచ్చి బాబుకి బలికావడమా, బీజేపీతోనే ఉండి.. వైసీపీతో కూడా చెలిమి చేయడమా తేల్చుకోవాల్సింది పవన్ కల్యాణే.

ఒకవేళ వైసీపీ, బీజేపీ, జనసేన కూటమి కుదిరితే పవన్ కంటే అదృష్టవంతులెవరూ ఉండరు. పోయినసారి రెండుచోట్లా ఓడిపోయిన పవన్, వచ్చేసారి కచ్చితంగా అసెంబ్లీలో కూర్చునే అవకాశం వచ్చినట్టే. అక్కడితో సంతోషపడితే బాగుంటుంది. సీఎం కుర్చీనే టార్గెట్ గా పెట్టుకుంటే మాత్రం 2024నాటికి పవన్ ఏకాకిగా మిగలాల్సిందే.