స్టార్ హీరోతో క్రేజీ వెబ్ సిరీస్…

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓటీటీ సీజన్ నడుస్తోంది. థియేటర్లు మూతపడ్డంతో ఓటీటీ బూమ్ హఠాత్తుగా పెరిగింది. అర్బన్ నుంచి పల్లెల వరకు అంతా స్మార్ట్ ఫోన్లలో ఓటీటీ కంటెంట్ చూడ్డానికి అలవాటుపడ్డారు. దీంతో కాస్త పేరున్న హీరోహీరోయిన్లు కూడా ఓటీటీలో కంటెంట్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా ఓ క్రేజీ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత అనీల్ సుంకర.

ఇన్నాళ్లూ భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించిన ఈ నిర్మాత, ఇప్పుడు ఓటీటీలో కూడా అడుగుపెట్టబోతున్నాడు. అయితే అందులో కూడా తనదైన ముద్ర వేయబోతున్నాడు. మధుబాబు రాసిన సూపర్ హిట్ నవల షాడోను వెబ్ సిరీస్ గా తీయడానికి రెడీ అవుతున్నాడు అనీల్ సుంకర. అంతేకాదు, ఇందులో కార్తికేయ లేదా సత్యదేవ్ ను హీరోగా పెట్టాలనుకుంటున్నాడు.

తెలుగులో మోస్ట్ పాపులర్ అయిన నవలల్లో షాడో ఒకటి. థ్రిల్లర్ నవలల్లో ఇది బాహుబలి టైపు అన్నమాట. ఇలాంటి నవలను వెబ్ సిరీస్ రూపంలో తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు సుంకర. అంతేకాదు.. సీజన్ల వారీగా ఈ సిరీస్ కోసం టాప్ డైరక్టర్లను రంగంలోకి దించే ఆలోచనలో కూడా ఉన్నాడు ఈ నిర్మాత.