ప్రభుత్వం తప్పులు పట్టుకోకూడదంటే ఆ పని ఎవరు చేయాలి – ఉండవల్లి

జగన్‌మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పందించారు. పాతప్రభుత్వం చేసిన తప్పులను పట్టుకోవడం ఈ ప్రభుత్వం పని కాదని హైకోర్టే చెబితే… మరి ఆ తప్పులను పట్టుకునే పని ఎవరు చేయాలని ఉండవల్లి ప్రశ్నించారు. ప్రస్తుతం నడుస్తున్నది జగన్‌మోహన్ రెడ్డి, ఒక న్యాయమూర్తికి మధ్య సమస్య కాదని… దీనిపై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిరూపించడం అంత ఈజీ కాదని… అలాంటప్పుడు భూములు కొంటే తప్పేంటి అని వాదించాల్సిందిపోయి గ్యాగ్‌ ఆర్డర్స్ తెచ్చుకోవడం వల్ల ప్రజల్లో మరింత చర్చకు దారి తీసిందన్నారు. ఏసీబీ కేసు పెట్టగానే ఎందుకు అంతగా కంగారుపడిపోయి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారో అర్ధం కావడం లేదన్నారు. గ్యాగ్‌ ఆర్డర్స్ వల్లే ఈ అంశంపై మరింత ఎక్కువగా చర్చ జరిగిందని… చివరకు నేడు హైకోర్టు కూడా తమ గ్యాగ్ ఆర్డర్స్ పనిచేయలేదని చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు. గ్యాగ్ ఆర్డర్స్ తర్వాత పెద్దవాళ్లను ప్రశ్నిస్తే ఇలాంటి ఆర్డర్స్‌ తెచ్చుకుంటారన్న మాట అన్న భావన ప్రజల్లో కలిగిందన్నారు.

చంద్రబాబుకు సంబంధించిన జడ్జిలు చాలా మంది ఉన్నారని… వారి వల్లనే చంద్రబాబు కేసుల్లో విచారణ జరగడం లేదన్న ఆరోపణలు 2001 నుంచే ఉన్నాయని ఉండవల్లి చెప్పారు. న్యాయవ్యవస్థపై ఒక ముఖ్యమంత్రి లేఖ రాయడం ఇదే తొలిసారి కాదని… గతంలో దామోదరం సంజీవయ్య కూడా నాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా రాశారని గుర్తు చేశారు.

టీడీపీ హయాంలో మహిళా సదస్సు నిర్వహిస్తే ఒక మహిళా సిట్టింగ్ జడ్జి మైకు ముందే… టీడీపీ లేకపోతే తమలాంటి వారికి భవిష్యత్తు ఉండేది కాదని వ్యాఖ్యానించారని ఉండవల్లి గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలను చూసి సదరు న్యాయమూర్తి టీడీపీకే మద్దతుగా తీర్పులిస్తారని అనుకోకూడదన్నారు. ఎన్టీఆర్‌ సీఎం అయిన తొలి రోజుల్లోనూ ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కోర్టు పక్కన పెట్టేదని… దాంతో ఒకసారి తనకు కావాల్సిన న్యాయమూర్తిని పిలిపించుకుని ఎన్టీఆర్‌ చర్చలు జరిపారని ఉండవల్లి గుర్తు చేశారు.