బాలయ్య నర్తనశాలకు మోక్షం

చాలా ఏళ్ల కిందటే దర్శకుడిగా, నిర్మాతగా మారాలని ప్రయత్నించాడు బాలయ్య. ఆ మేరకు తనే మెగాఫోన్ పట్టుకొని నర్తనశాల అనే సినిమా స్టార్ట్ చేశాడు. అయితే సౌందర్య హఠాన్మరణంతో ఆ ప్రాజెక్టు అతీగతీ లేకుండా పోయింది. అలా ఏళ్లుగా నిలిచిపోయిన నర్తనశాలకు ఇప్పుడు మోక్షం దక్కింది.

నర్తనశాల సినిమాలో అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించారు. దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా ఈ విజయదశమి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు.

ఈ చిత్రం ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా అక్టోబర్ 24న విడుదలవుతుంది. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి నందమూరి బాలకృష్ణ సంకల్పించారు. ఎన్నాళ్ళగానో నర్తనశాల కోసం రూపొందించిన సన్నివేశాలను చూడాలన్న కోరిక ఈ నెల 24 నుండి నెరవేరబోతోంది. ఇది నందమూరి అభిమానులకు, ప్రేక్షకులకు ఒక శుభవార్త.