ఏపీ న్యాయవ్యవస్థపై ఒక నేత పట్టు గురించి విదేశీ స్కాలరే చెప్పారు – జస్టిస్ డీఎస్‌ఆర్‌ వర్మ

జగన్‌మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన అంశంపై…. ఉమ్మడి ఏపీ హైకోర్టుతో పాటు అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాస రంగనాథ వర్మ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వానికి నష్టం కలిగేలా, అభద్రతా భావం కలిగించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించకూడదని… తోటి వ్యవస్థలను అభద్రతాభావంలోకి నెట్టడం న్యాయవ్యవస్థ పని కాదని రంగనాథ వర్మ వ్యాఖ్యానించారు. అలాంటి అభద్రతా భావం కలిగించినప్పుడు బాధతోనే ముఖ్యమంత్రి … ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి ఉండవచ్చన్నారు.

దీనిపై కోర్టు ధిక్కార చట్టాన్ని ప్రయోగించరాదని.. అలా చేస్తే ప్రశ్నించే వ్యక్తులను, ప్రభుత్వాల గొంతులను నొక్కడమే అవుతుందని వర్మ వ్యాఖ్యానించారు. గతంలో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి నుంచి ఒక లేఖ వచ్చిందని… అదే లేఖ మక్కీకి మక్కీగా నాటి ప్రభుత్వాధినేత నుంచి మరో లేఖ వచ్చిందన్నారు. రెండు లేఖలు మక్కీకి మక్కీగా ఉన్నాయన్నారు. దాన్ని ఏమనుకోవాలని ప్రశ్నించారు. న్యాయమూర్తులు బెంచ్‌ మీద నుంచి ఇష్టానుసారం ప్రభుత్వాలపై వ్యాఖ్యలు చేయడం కూడా సరికాదని జస్టిస్ రంగనాథ వర్మ అభిప్రాయపడ్డారు.

భారత న్యాయవ్యవస్థపై ఇంగ్లడ్‌ బర్మింగ్‌ హోం యూనివర్శిటీకి చెందిన ఒక వ్యక్తి 2004లో…. అప్పటి ముఖ్యమంత్రి రాష్ట్ర న్యాయవ్యవస్థపై గట్టి పట్టు కలిగి ఉన్నారని తన పరిశోధన పత్రంలో వివరించారని గుర్తు చేశారు. ఆ ముఖ్యమంత్రి ఎవరో కూడా అందరికీ తెలుసన్నారు. విదేశీ స్కాలర్స్‌ కూడా భారత న్యాయవ్యస్థ గురించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ న్యాయవ్యవస్థ గురించి అలా మాట్లాడారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని జస్టిస్ డీఎస్‌ఆర్‌ వర్మ ఆవేదన చెందారు.