నవంబర్‌ 2 నుంచి ఏపీ స్కూళ్లు ప్రారంభం – జగన్‌

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నప్పటికీ నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు తెరవాలని నిర్ణయించింది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డే ప్రకటించడంతో అమలు ఖాయంగా కనిపిస్తోంది.

నవంబర్ 2 నుంచి స్కూళ్లు ప్రారంభించేందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. 1,3,5,7 తరగతులను ఒకరోజు, 2, 4,6,8 తరగతులను మరో రోజు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. మధ్యాహ్నం వరకే స్కూళ్లు నిర్వహిస్తారు. మధ్యాహ్న భోజనం పెట్టి పిల్లలను ఇంటికి పంపిస్తారు. ఒకవేళ విద్యార్థుల సంఖ్య 750కిపైగా ఉంటే మూడు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నవంబర్‌ నెలలో ఈ పద్దతిని పరిశీలించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపేందుకు ఇష్టపడకపోతే వారికి ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కరోనా కేసులు ఇంకా రోజుకు వేలలో నమోదు అవుతున్న తరుణంలో ఈ నిర్ణయం ఎంత వరకు సరైనది అన్న దానిపైనా చర్చ నడుస్తోంది. ఒకవేళ తేడా వస్తే మాత్రం ప్రభుత్వం భారీ నిందను మోయాల్సి రావొచ్చు.