తిరువనంతపురం ఎయిర్ పోర్టు లీజు… కేంద్రానికి అనుకూలంగా తీర్పు !

తిరువనంతపురం ఎయిర్ పోర్టు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్లను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. తిరువనంతపురం విమానాశ్రయం ఆపరేషన్, నిర్వహణ, అభివృద్ధి సంబంధిత కార్యక్రమాల నిమిత్తం అదానీ ఎంటర్ ప్రైజెస్ కి యాభై సంవత్సరాలకు లీజ్ కు ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేరళ ప్రభుత్వం హైకోర్టులో పలు పిటీషన్లు వేసింది.

తిరువనంతపురం విమానాశ్రయంతో పాటు మరో అయిదు ఎయిర్ పోర్టుల నిర్వహణ బాధ్యతలను లీజుకు తీసుకున్న అదానీ గ్రూపు… ఇప్పుడు భారతదేశపు ప్రముఖ ఎయిర్ పోర్టుల ఆపరేటర్ స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది ఫిబ్రవరిలోనే ఈ వ్యాపార ఒప్పందాలు జరిగాయి. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని, ప్రయివేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్… కోర్టులో పలు పిటీషన్లను దాఖలు చేశాయి.  న్యాయమూర్తులు కె. వినోద్ చంద్రన్, టి ఆర్ రవి లతో కూడిన ధర్మాసనం ఆ పిటీషన్లను కొట్టివేస్తూ కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ తీర్పునిచ్చింది.

కేంద్ర మంత్రివర్గం మద్ధతుతో ప్రభుత్వ విధి విధానాలమేరకే ఎయిర్ పోర్టు లీజు వ్యవహారం జరిగిందని, ఒక వైపు ప్రభుత్వం… తను కూడా లీజుకి సంబంధించిన వేలం పాటలో పాల్గొని, మరో వైపు ఈ పద్ధతి సరికాదని విమర్శించడం ఆమోద యోగ్యంగా లేదని, అదానీ కంపెనీకి అనుకూలంగా ఎయిర్ పోర్టు లీజు వ్యవహారాలు నడిచాయనటంలో కూడా నిజం లేదని కోర్టు పేర్కొంది.

ప్రభుత్వ స్థలంలో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రయివేటు కంపెనీకి లీజుకి ఇవ్వటం సరికాదని, ప్రజలపై భారం పడకూడదనే… ఒక్కో ప్రయాణీకుడికి అయ్యే ఖర్చుని ప్రభుత్వం తక్కువగా కోట్ చేసిందని కేరళ ప్రభుత్వం పేర్కొంది. కేరళ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ ఎయిర్ పోర్ట్ నిర్వహణ విషయంలో ఒక్కో ప్రయాణీకుడికి అయ్యే ఖర్చుని  135 రూ.లుగా పేర్కొనగా అదానీ గ్రూపు ఈ మొత్తాన్ని 168రూ.లుగా నిర్ణయించింది.

తిరువనంతపురం ఎయిర్ పోర్టుని అదానీ కంపెనీకి లీజుకి ఇచ్చిన తరువాత కేరళ ప్రభుత్వం రెండుసార్లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి తాము సహకరించలేమని అందులో పేర్కొంది. ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సైతం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైపున నిలబడింది. అదానీ కంపెనీ కోట్ చేసిన 168రూ.లకు తామూ అంగీకరిస్తున్నట్టుగా తెలిపామని… అయినా కేంద్రం అనుమతినివ్వలేదని కేరళ ప్రభుత్వం తెలిపింది.

గత ఏడాది ఫిబ్రవరిలో తిరువనంతపురంతో పాటు లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, గువహాటి ఎయిర్ పోర్టుల నిర్వహణల తాలూకూ లీజు హక్కులను అదానీ కంపెనీ పొందింది. జిఎమ్మార్ ఎయిర్ పోర్ట్స్, కేరళ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్, కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్, జూరిచ్ ఎయిర్ పోర్టులతో పాటు ఎనిమిది కంపెనీలతో పోటీ పడి అదానీ ఈ హక్కులకు సొంతం చేసుకుంది.