జేసీ ట్రావెల్స్‌పై కర్నాటకలో వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాన్ని వాహనాల నకిలీ రిజిస్ట్రేషన్ వ్యవహారం వెంటాడుతోంది. బీఎస్‌3 వాహనాలను బీఎస్‌4 వాహనాలుగా చూపుతూ నకిలీ పత్రాల సాయంతో రిజిస్ట్రేషన్ చేసిన అంశంపై కర్నాటకలోనూ జేసీ కుటుంబంపై ఫిర్యాదు నమోదు అయింది. ఈ ఫిర్యాదును వైసీపీ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డే స్వయంగా చేశారు.

2017లో సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్‌ 3 వాహనాలను స్క్రాప్‌ కింద కొనుగోలు చేసి వాటిని నకిలీ పత్రాల సాయంతో బీఎస్‌ 4 వాహనాలుగా రిజిస్ట్రేషన్‌ చేయించారన్నది ప్రధాన అభియోగం.

కర్నాటకలోనూ ఈ తరహా రిజిస్ట్రేషన్లు చేయించడంతో పాటు అక్కడ 33 వాహనాలను జేసీ ట్రావెల్స్ నడుపుతోందంటూ పెద్దారెడ్డి కర్నాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. కర్నాటక డీజీపీకి కూడా ఫిర్యాదు ఇచ్చారు.

ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన ముఖ్య అనుచరుడు గోపాల్‌ రెడ్డిపైనా ఫిర్యాదు చేశారు. నకిలీ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై విచారణ జరిపించి నిందితులపై చర్యలు తీసుకోవాలని పెద్దారెడ్డి కోరారు.