లోకేష్ యాత్ర విషయంలో బాబు తప్పు చేశారా..?

నారా లోకేష్ ని ఇన్నాళ్లూ జనంలోకి పంపకుండా కేవలం ట్విట్టర్ కే పరిమితం చేశారు చంద్రబాబు. లోకేష్ కి తెలుగులో మెళకువలు నేర్పించడంతోపాటు, పర్సనాల్టీ డెవలప్ మెంట్ తదితర అంశాలపై చాన్నాళ్లు క్లాస్ లు కూడా నడిచాయి. కరోనా కాలంలో కసరత్తులు ఫలించి కాస్త నాజూగ్గా తయారైన లోకేష్ ని ఎట్టకేలకు జనంలోకి వదిలారు బాబు. వస్తూ వస్తూనే.. వరద బాధితుల పరామర్శకు వెళ్లారు లోకేష్.

అయితే తొలి యాత్రలోనే ఆయనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అసలు పంటల గురించి అవగాహన కానీ, పంట నష్టంపై అంచనా కానీ లేని లోకేష్.. నేరుగా రైతులతో ఏం మాట్లాడారు, ఎలాంటి ప్రతిస్పందన వచ్చిందనే విషయాలను టీడీపీ మీడియా బైటపెట్టడంలేదు. కేవలం రైతుల భుజంపై లోకేష్ చేయి వేసి దిగిన ఫొటోలు, బురదలో దిగిన ఫొటోల్ని మాత్రం హైలెట్ చేసుకుంటూ వ్యవహారం నడిపించింది.

పరామర్శ యాత్రను రాజకీయ యాత్రగా మార్చడం చంద్రబాబు చేసిన మరో తప్పు. పొరపాటున వైరి వర్గాలు ప్రశ్నలు సంధిస్తే.. లోకేష్ ఉక్కిరిబిక్కిరి అవుతారనే ఆలోచనతో.. పూర్తిగా టీడీపీ డామినేషన్ ఉన్న ప్రాంతాల్లోనే ఆయన పర్యటన సాగేలా ఏర్పాట్లు చేశారు. పొలాల్లో రైతులు సైతం లోకేష్ ఫ్లెక్సీలను పట్టుకుని ఆయనకు స్వాగతం చెప్పారంటే.. ఆ యాత్రకు ఎంత పగడ్బందీగా స్క్రీన్ ప్లే తయారైందో అర్థం చేసుకోవచ్చు.

భావి నాయకుడిగా లోకేష్ ని ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్న చంద్రబాబు.. ఇలా సేఫ్ గేమ్ ఆడాలనుకోవడం పార్టీకి కానీ, లోకేష్ కి కానీ ఏమేరకు ప్రయోజనమో ఆయనకే తెలియాలి. ప్రజల కష్టాలు తెలుసుకోవాలంటే.. టీడీపీ కార్యకర్తల మధ్యకు వెళ్తే సరిపోతుందా? వరదల్లో పరామర్శకు వెళ్లే నాయకులు మందీమార్బలం తో బయలు దేరతారా? పోనీ ఈ యాత్ర వల్ల లోకేష్ కి కానీ, పార్టీకి కానీ ఏమైనా ఉపయోగం ఉందా? కేవలం విమర్శలకోసమే లోకేష్ యాత్ర చేస్తున్నాని అర్థమవుతోంది.

వర్షాలకు, వరదలకు తేడా తెలియని లోకేష్.. బైటకెందుకొచ్చారని వైసీపీ ప్రశ్నిస్తోంది. వరదల్లాంటి కష్టకాలంలో కూడా ప్రజలనుంచి ప్రతిపక్షానికి సింపతీ లభించలేదంటే.. కచ్చితంగా అది టీడీపీ వైఫల్యంగానే భావించాలి.

మొత్తమ్మీద కొడుకు పరామర్శ యాత్ర విషయంలో తండ్రి పూర్తిగా కసరత్తు చేయలేదని అర్థమవుతోంది. ప్రజల్లోకి పంపించకుండా.. కార్యకర్తల మధ్యకే లోకేష్ ని పంపిస్తే.. ఆయన ట్విట్టర్లో ఉన్నా ఒకటే, రోడ్డుపైకి వచ్చినా ఒకటేనని టీడీపీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి.