ఎన్నికలకు నిధులు ఇప్పించాలంటూ కోర్టుకు నిమ్మగడ్డ

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరు విచిత్రంగా ఉంది. ఒకటి రెండు కరోనా కేసులు నమోదు అయిన సమయంలో ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ… ఇప్పుడు వేల సంఖ్యలో కేసులు వస్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహించేందుకు సానుకూలత చూపడం చర్చనీయాంశమైంది.

ఎన్నికల నిర్వాహణకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. తాము ఎప్పుడు నిధులు కోరితే అప్పుడు తక్షణం నిధులు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం విచారించింది.

ఈసీ నిధులు కోరితే రెండు గంటల్లో వారి ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందని ప్రభుత్వ తరుపు న్యాయవాది చెప్పారు. కాబట్టి ఈ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇందుకు స్పందించిన కోర్టు… నిధులు ఈసీ ఖాతాలో జమ అయ్యాయో లేదో తెలుసుకుని ఈ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.

వచ్చే మార్చి 31తో నిమ్మగడ్డ పదవీకాలం ముగుస్తోంది. ఆలోపే ఎన్నికలు నిర్వహిస్తే తమకు అనుకూలంగా ఉంటుందన్న అభిప్రాయంతో ఇటీవల టీడీపీ ఉంది. అందుకు తగ్గట్టుగానే టీడీపీ పావులు కదుపుతోంది. ఇప్పుడు నిమ్మగడ్డ కూడా ఎన్నికల నిర్వహణకు నిధులు విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు వెళ్లడం ఆసక్తిగా ఉంది.