ఎన్నికలకు సహకరించండి – ఏపీ హైకోర్టు

గతంలో ఏకపక్షంగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఎన్నికల నిర్వాహణకు సహకరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.

ఈ అంశంపై తాను ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో గవర్నర్‌కు వినతిపత్రం కూడా ఇచ్చానని పిటిషన్ లో వివరించారు. బుధవారం మరోసారి ఈ అంశంపై విచారణ జరగగా… ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని నిమ్మగడ్డ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. స్పందించిన కోర్టు… ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ప్రభుత్వానికి సూచించింది.

ఈసీకి ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని ప్రభుత్వ న్యాయవాది సూచించగా… ఒక రాజ్యాంగ సంస్థ ప్రభుత్వ వైఖరి కారణంగా ఇలా కోర్టును ఆశ్రయించాల్సి రావడం దురదృష్టకరమని కోర్టు అభిప్రాయపడింది. ఏఏ అంశాల్లో ప్రభుత్వం సహకరించడం లేదో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.