సీఎం పర్యటనతో ఆంక్షల వల్ల తప్పిన పెను ప్రమాదం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మూల నక్షత్రం రోజున అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపుకుంకుమను సీఎం సమర్పించారు. వేదపండితులు, ఆలయ అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

సీఎం పర్యటనకు ముందు కొండ చరియలు ఇరిగిపడ్డాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో అప్పటికే రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించడంతో పెనుప్రమాదం తప్పింది. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి విరిగిపడిన కొండచరియలను పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడే అవకాశాన్ని ఇంజనీరింగ్‌ అధికారులు ముందే గుర్తించారు.

దుర్గగుడి అభివృద్ధికి 70 కోట్ల రూపాయలు అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినట్టు ఆలయ చైర్మన్ స్వామినాయుడు వివరించారు. ఘాట్‌ రోడ్డు అభివృద్ధి, లడ్డూపోటు, సోలార్ సిస్టిమ్ ఏర్పాటు వంటి పనులకు నిధులను సీఎం ప్రకటించినట్టు ఆలయ చైర్మన్‌ వివరించారు.