టీడీపీ బరితెగింపు వాదన

గీతం యూనివర్శిటీ భూ కబ్జా వ్యవహారం చివరకు రాజకీయ వివాదంగా మారింది. ప్రభుత్వ చర్యపై ఒకవైపు ప్రశంసలు వస్తుంటే… తెలుగుదేశం పార్టీ మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తోంది.

గీతం యూనివర్శిటీ బాలకృష్ణ చిన్నల్లుడిది కావడంతో చంద్రబాబు నుంచి నారా లోకేష్ వరకు‌ ప్రభుత్వ చర్యను ఖండించారు. కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని విచిత్రంగా కక్షపూరితమైన చర్యగా, విధ్వంసంగా టీడీపీ పెద్దలు అభివర్ణించారు. ఎంతో మందికి విద్యనందించిన యూనివర్శిటీ కట్టడాల కూల్చివేత దారుణమని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఎలా కూలుస్తారని లోకేష్‌ ప్రశ్నించారు.

చంద్రబాబు మరో అడుగు ముందుకేసి గీతం వర్శిటీ నుంచి భూములు స్వాధీనం చేసుకోవడాన్ని తప్పుపడుతూ… ఆంధ్రప్రదేశ్‌ను దక్షిణ భారత బీహార్‌ అంటూ అభివర్ణించారు. గీతం యూనివర్శిటీ ఒక ఆదర్శవంతమైన సరస్వతీ నిలయం అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

800 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి విడిపిస్తే టీడీపీ ఎదురుదాడి చేయడంపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. యూనివర్శిటీకి గాంధీ పేరు పెట్టుకుని 800 కోట్ల విలువైన భూమిని ఆక్రమించినందుకు సిగ్గుపడాల్సిందిపోయి దబాయింపు ఏంటని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.

ఈ భూమిని కబ్జా చేసిన విషయాన్ని ఐదు నెలల క్రితమే అధికారులు గుర్తించిన విషయం కూడా గీతం యాజమాన్యానికి తెలుసని… అయినా ఇప్పుడు నోటీసు ఇవ్వకుండా కూలుస్తారా అని ప్రశ్నించడం ఏమిటని వ్యాఖ్యానించారు.

వందల ఎకరాల భూమిని కబ్జా చేయడం… దాన్ని తర్వాత రెగ్యులరైజ్ చేయండి అంటూ ప్రభుత్వానికి వినతిపత్రం పెట్టుకోవడం అలవాటుగా మారిందన్నారు. తెలిసో తెలియకో సెంటు, అర సెంటు ఆక్రమించుకుంటే రెగ్యులరైజ్ చేయవచ్చు గానీ… ఇలా 800 కోట్ల విలువైన భూ కబ్జాను ప్రభుత్వం ఎలా ఆమోదిస్తుందనుకున్నారని అమర్ నాథ్ ప్రశ్నించారు.

ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే దాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు ఎందుకు ఇవ్వాలని మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. కబ్జా చేసే ముందు ఏమైనా ప్రభుత్వానికి నోటీసు ఇచ్చి చేశారా అని నిలదీశారు.