‘బీజేపీ నుండి నేను సురక్షితం’ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ ప్రచారం !

వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరా హోరీ ప్రచారంలోకి దిగుతున్నాయి. అధికారంలో ఉన్న ఆల్ ఇండియా  తృణమూల్ కాంగ్రెస్ పార్టీ… సోషల్ మీడియా వేదికలపై ఒక డిజిటల్ ప్రచారం ప్రారంభించింది. ‘మార్క్ యువర్ సెల్ఫ్ సేఫ్ ఫ్రమ్ బీజేపీ’  అంటూ మొదలుపెట్టిన ఈ ప్రచారానికి నెటిజన్లు ఎక్కువ సంఖ్యలోనే స్పందిస్తున్నారు.

‘సేవ్ బెంగాల్ ఫ్రమ్ బీజేపీ డాట్ కామ్’… అనే వెబ్ సైట్ లో ఇప్పటికే 1,21,000 మంది తాము బీజేపీ నుండి సురక్షితంగా ఉన్నామంటూ నమోదు చేశారు. గంటగంటకూ ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఫేస్ బుక్ లో ఈ ప్రచారానికి ఎనభై వేలమంది వరకు స్పందించారు. దేశవ్యాప్తంగా బీజేపీ పాలనలోని తప్పులు లోపాలకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రజలను ఏకం చేయడానికి ఈ ప్రచారాన్ని ఒక సాధనంగా వినియోగించుకుంటున్నామని తృణమూల్ పార్టీ వర్గీయులు అంటున్నారు.

బీజేపీ… విభజన రాజకీయాలు, అసమానతలు, మహిళలపై అత్యాచారాలు, మైనారీటీలపై హింస మొదలైనవాటి ద్వారా ప్రజల్లో ఉన్న స్నేహ సౌభ్రాతృత్వాలను నాశనం చేస్తోందని,  ప్రజలు బీజేపీ వ్యూహాలను తెలుసుకోవాలని, తమకు తాముగా ముందుకు వచ్చి బీజేపీ నుండి సురక్షితంగా ఉన్నామని తెలియజేయాలని  తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

దుర్గా పూజ సందర్భంగా ఎక్కువమంది బెంగాలీయులు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారని అందుకే ఈ ప్రచారానికి ఈ సమయాన్ని ఎంచుకున్నామని తృణమూల్ పార్టీ నేతలు తెలిపారు.