నర్తనశాల – నందమూరి షార్ట్ ఫిల్మ్

నందమూరి బాలకృష్ణ దర్శకత్వం వహించిన నర్తనశాల వీడియో దసరా సందర్భంగా రిలీజైంది. శ్రేయాస్ ఈటీ ఏటీటీలో స్ట్రీమింగ్ కు దీన్ని పెట్టారు. 50 రూపాయలు చెల్లించి బాలకృష్ణ దర్శకత్వం ప్రతిభను వీక్షించవచ్చు. అయితే దీన్ని సినిమా అనాలా లేక షార్ట్ ఫిలిమ్ అనాలా అనేది అందరి డౌట్. అంతా కలిసి తేల్చిందేంటంటే.. నర్తనశాల సినిమాకు సంబంధించి ఇవి కొన్ని విజువల్స్ మాత్రమే.

ఇక విజువల్స్ లో ఏముందనే విషయానికొస్తే.. 16 నిమిషాల నిడివి ఉన్న ఈ విజువల్స్ లో అరణ్యవాసం పూర్తి చేసుకుని అజ్ఞాతవాసానికి వెళ్లాల్సిన పాండవుల్లో ఎవరెవరు ఏ వేషాలు వేసుకోవాలి, ఏ విధంగా ఎవరి కంట పడకుండా ఏడాది గడపాలని చర్చించుకునే సీన్ ఉంది. చాలా సుదీర్ఘమైన సీన్ ఇది.

బాలయ్య డైరక్ట్ చేసిన సీన్ ఇదొక్కటే. ఇక మిగిలిన సన్నివేశం ఏంటంటే.. ఎన్టీఆర్ నటించిన ఒరిజినల్ నర్తనశాల సినిమా నుంచి పాటను యాజ్ ఇటీజ్ పెట్టేశారు. అన్నింటికంటే దారుణం ఏంటంటే.. టాప్ హీరో అనే సినిమాలో బాలయ్య ఓ సీన్ లో బృహన్నలగా కనిపిస్తాడు. ఆ సీన్ కూడా పెట్టేశారు. ఇలా అన్నీ కలిపి 16 నిమిషాల సీన్లు పెట్టి.. 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇంతోటి దానికి బాలయ్య ఏకంగా 30 నిమిషాల ఇంటర్వ్యూ ఇచ్చారు.