ఫ్లైట్ ఎక్కకుండా జర్నలిస్ట్ లపై నిషేధం… జాతీయ మీడియా అతిపై క్రమశిక్షణ చర్యలు…

జాతీయ మీడియా అతి మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు తావిచ్చింది. ఏకంగా 9మంది జర్నలిస్ట్ లపై ఇండిగో సంస్థ నిషేధం విధించింది. అక్టోబర్ 15నుంచి 30వరకు.. ఈ తొమ్మిదిమందిలో ఎవరూ తమ సంస్థకు చెందిన ఫ్లైట్ ఎక్కకుండా ఆదేశాలు జారీ చేసింది.

భారత దేశ వైమానిక రంగ చరిత్రలోనే విలేకరులపై ఓ విమానయాన సంస్థ నిషేధం విధించడం ఇదే తొలిసారి.

అసలింతకీ విలేకరులు చేసిన తప్పేంటి? వారిపై ఎందుకీ నిషేధం..

సెప్టెంబర్ 9. చండీఘడ్ నుంచి ముంబైకి ఇండిగో ఫ్లైట్ బయలుదేరింది. అందులో సినీ నటి కంగనా రనౌత్ ప్రయాణిస్తున్నారు. అప్పటికే.. కంగనా రనౌత్, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. కంగన ఆఫీస్ లోని కొంత భాగాన్ని ముంబై కార్పొరేషన్ అధికారులు కూల్చి వేశారు.

ఈ సంఘటనలు జరిగే సమయంలో చండీఘడ్ లో ఉన్న కంగన.. హుటాహుటిన ముంబైకి బయలుదేరారు. దీంతో జాతీయ మీడియా కూడా ఆమెను అనుసరించింది. అదే ఫ్లైట్ లో 9మంది జర్నలిస్ట్ లు (రిపోర్టర్లు, కెమెరామెన్లు) ఆమెతోపాటు ప్రయాణించారు.

సాధారణంగా ఫ్లైట్ ఎక్కగానే మీ సెల్ ఫోన్లు ఆఫ్ చేయండి అని చెబుతుంటారు సిబ్బంది, అందులోనూ కొవిడ్ టైమ్ కావడంతో.. మరిన్ని జాగ్రత్తలు చెప్పారు. సామాజిక దూరం పాటించండి, ప్రయాణికులు ఎవరూ ఒకరి పక్కన ఒకరు కూర్చోవద్దు అని చెప్పారు.

తీరా ఫ్లైట్ ముంబైలో ల్యాండ్ అవుతుందనుకుంటున్న టైమ్ లో.. ఒక్కసారిగా జర్నలిస్ట్ లు అందరూ కంగనా వద్దకు వచ్చేశారు. రన్ వే పై ల్యాండ్ అయ్యే టైమ్ లో ఆమెను చుట్టుముట్టి ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించారు. కెమెరాలు ఆన్ చేశారు, మైక్ లు తీసుకుని దూసుకొచ్చారు.

ఈ సీన్ చూసి లోపల ఉన్న సాధారణ ప్రయాణికులు షాక్ అయ్యారు. ఫ్లైట్ సిబ్బంది ఎంత మొత్తుకున్నా కూడా జర్నలిస్ట్ లు వినలేదు. ఫ్లైట్ లో కెమెరాలు ఆన్ చేయకూడదు, రికార్డింగ్ ఆపండి అన్నా కూడా వినలేదు. కొవిడ్ టైమ్ లో సామాజిక దూరం పాటించండి అన్న నిబంధనలను అస్సలు పట్టించుకోలేదు.

కొంతమంది ప్రయాణికులు మీడియా చేస్తున్న అతిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఈ వ్యవహారంపై డీజీసీఏ దృష్టిసారించింది. నిబంధనలు ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలని ఇండిగో సంస్థకు సూచించింది.

ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించిన ఇండిగో సంస్థ.. సదరు 9మంది జాతీయ జర్నలిస్ట్ లపై 15రోజులపాటు నిషేధం విధించింది. సహజంగా.. ప్రయాణికులెవరైనా ప్లైట్ లో నిబంధనలు అతిక్రమిస్తే 3నెలలపాటు వారిని ఆ సంస్థ బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది. తమ విమానం ఎక్కనివ్వదు, మరీ శృతిమించితే 6నెలలు, ఇంకా ఎక్కువగా గొడవ చేస్తే రెండేళ్లపాటు నిషేధం ఉంటుంది.

జర్నలిస్ట్ లపై ఉదారంగా 15రోజులపాటు ఇండిగో సంస్థ నిషేధం విధించింది. ఈ నిషేధం వల్ల వారికి కలిగే నష్టమేమీ లేదు కానీ.. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం మరోసారి హైలైట్ అయింది. జర్నలిస్ట్ లు తమని తాము చట్టాలకు, నిబంధనలకు అతీతులం అనుకోవడం తప్పు అని మరోసారి రుజువైంది.