నిమ్మగడ్డ మరో వివాదం

ప్రభుత్వంతో ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో కయ్యంపెట్టుకున్నారు. హైకోర్టులోనే సంగతి తేల్చుకుంటా అంటూ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఈనెల 26న పార్లమెంట్ ఉప ఎన్నికలు, శాసనమండలి ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌ భేటీ నిర్వహిస్తున్నారని… దానికి హాజరు కావాల్సిందిగా ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి వర్తమానం వెళ్లింది.

దాన్ని చూసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆగ్రహించారు. తననే భేటీకి పిలుస్తారా అంటూ మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్‌ని ఒక సమావేశానికి రావాల్సిందిగా వర్తమానం పంపడం తీవ్ర అభ్యంతరకరమని, ఇది బెదిరింపు ధోరణిలో ఉందని నిమ్మగడ్డ తిరిగి ప్రవీణ్ ప్రకాశ్‌ కార్యాలయానికి సమాధానం పంపారు. మీ వ్యవహారంపై హైకోర్టులోనే తేల్చుకుంటానంటూ నిమ్మగడ్డ రిప్లై పంపారు. ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు ఎన్నికల కార్యాలయం నుంచి ఎవరూ వెళ్లడానికి వీల్లేదంటూ ఆదేశించారు.

ప్రవీణ్ ప్రకాశ్ కార్యాలయం మాత్రం తాము మెసేజ్ పంపింది ఎన్నికల సంఘం కార్యదర్శి వాణిమోహన్‌కి అని చెబుతోంది. అయినా ప్రభుత్వం భేటీ నిర్వహిస్తామంటే మరీ ఈ రేంజ్‌లో నిమ్మగడ్డ ఓవర్‌గా స్పందించి ఓవరాక్షన్ చేయడంపైనా చర్చ జరుగుతోంది.