వరకట్న వేధింపులు… మహిళా హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య !

సాధారణ ప్రజలు తమకు సమస్యలుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. తమకు అండగా పోలీస్ వ్యవస్థ ఉన్నదని నమ్ముతారు. మరి అలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నవారే… నిస్సహాయంగా ఆత్మహత్యకు పాల్పడితే… ఇలాంటి ఘటనే రాజస్థాన్ లో జరిగింది.

రాజస్థాన్ లోని బండీ అనే ప్రాంతానికి చెందిన  మహిళా హెడ్ కానిస్టేబుల్ అనితా గుర్జార్  (35)  కట్నం కోసం భర్త పెడుతున్న బాధలను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. జైపూర్లోని హదీ రాణీ బెటాలియన్  విభాగం (రాజస్థాన్ లో మొట్టమొదటి సాయుధ మహిళా బలగం ఇది)లో  పనిచేస్తున్న అనితా గుర్జార్ రఘునాథ్ పురా అనే గ్రామంలో తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.

అనిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్తపై వరకట్న వేధింపుల కేసుని నమోదు చేశారు. ఆమె తన భర్త కొడుకులతో కలిసి జీవిస్తున్నదని పోలీసులు వెల్లడించారు. అనితకు 2015లో వివాహమైంది. ఆమె భర్త పేరు పింకు గుర్జార్. అతను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా పనిచేస్తున్నాడు.

కుటుంబ సభ్యుల, ఇంటి చుట్టుపక్కలవారి స్టేట్ మెంట్లను రికార్డు చేశామని, తమకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని కేసుని విచారిస్తున్న పోలీసు అధికారి ఒకరు తెలిపారు.