నెలలో రెండోసారి… 50 వేలకంటే తక్కువ కేసులు !

ఈ నెలలో రెండోసారి… ఇరవై నాలుగుగంటల వ్యవధిలో 50,000 కంటే తక్కువగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేసులు తగ్గుముఖం పడుతున్నాయనేందుకు నిదర్శనంగా…ఈ రోజు ఎనిమిది గంటలకు అప్ డేట్ అయిన గణాంకాల ప్రకారం… గత ఇరవై నాలుగు గంటల్లో యాభై వేల కంటే తక్కువ కేసులు, 480 మరణాలు నమోదయ్యాయి. 108 రోజుల తరువాత 500 కంటే  తక్కువ మరణాలు సంభవించడం కూడా ఇదే మొదటిసారి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఈ వివరాలను ప్రకటించింది.

45,148 కొత్త కేసులతో భారత్ లో మొత్తం కేసుల సంఖ్య 79,09,959. ప్రస్తుత 480 మరణాలతో సహా మొత్తం 1,19,014 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 71,37,228 మంది కోవిడ్ నుండి కోలుకున్నారు. దీంతో జాతీయ రికవరీ రేటు 90.23 శాతంగా ఉంది. అలాగే మరణాల రేటు 1.50 శాతానికి తగ్గింది.

కొత్తగా నమోదైన 480 మరణాల్లో 112 మహారాష్ట్రలో, 60 పశ్చిమ బెంగాల్లో, 33 ఢిల్లీలో, 32 కర్ణాటకలో, 31 తమిళనాడులో, 28 ఉత్తర ప్రదేశ్ లో సంభవించాయి. మరణించినవారిలో 70శాతం మంది… ఒకటి కంటే ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు.

దేశంలో కరోనా యాక్టివ్ కేసులు వరుసగా నాలుగవ రోజు ఏడు లక్షలకంటే తక్కువగా ఉన్నాయి. ఆగస్టు సెప్టెంబరు నెలల్లో కోవిడ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉండగా, ఆగస్టు 7, ఆగస్టు 23, సెప్టెంబరు 5ల్లో మనదేశం వరుసగా 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల కేసుల మార్క్ లను దాటింది. ఆ తరువాత మరింత వేగంగా సెప్టెంబరు 16న 50 లక్షల మార్కును, సెప్టెంబరు 28న 60 లక్షల మార్కుని దాటగా, అక్టోబరు 11న 70 లక్షల సంఖ్యని దాటింది.

అత్యధిక మరణాలు నమోదైన రాష్ట్రాలు వరుసగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్.