జనసేన, బీజేపీ కాపురం మూణ్ణాళ్ల ముచ్చటేనా..?

2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలసి పనిచేసిన జనసేన, ఆ తర్వాత కాలక్రమంలో ఆ రెండు పార్టీలకు దూరమై వామపక్షాలు, బీఎస్పీ.. తదితర పార్టీలతో జట్టు కట్టింది. 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత పవన్ మెల్లిగా రెండోసారి బీజేపీ పంచన చేరారు. ఈ దఫా బంధం మరింత బలంగా కుదిరిందని అనుకున్నారంతా.

కేంద్రం తీసుకొచ్చిన విద్యా సంస్కరణల్లో పవన్ ఆలోచన కూడా ఉందని ఏకంగా కేంద్ర మంత్రులే ప్రకటించడం, అక్కడ మోదీ ఏ పనిచేసినా.. ఇక్కడ పవన్ అతిగా భజన చేయడం.. ఇవన్నీ చూస్తుంటే ఒకరితో ఒకరు బాగానే కలిసిపోయారనే భ్రమ కలిగింది.

పొత్తుపొడిచిన కొత్తలో.. రాష్ట్రంలో ఏ కార్యక్రమమైనా ఇరు పార్టీలు కలసే చేసేవి. నిన్న మొన్నటి అంతర్వేది ఆందోళనల్లో కూడా జనసేన, బీజేపీ జెండాలు కలిసే ఎగిరాయి. ఇప్పుడు ఇద్దరి మధ్య వ్యవహారం బెడిసికొట్టిందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

కేంద్రంలో వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు తెలపడం, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రులు ప్రశంసల జల్లు కురిపించడంతో బీజేపీ, వైసీపీ మధ్య ఉన్న గ్యాప్ పూర్తిగా తగ్గిపోయింది. అదే సమయంలో జగన్ అంటే జలసీతో రగిలిపోయే పవన్ పార్టీకి బీజేపీకి మధ్యగ్యాప్ పెరిగిపోయింది.

ఇటీవల కాలంలో ప్రధాని మోదీ ప్రసంగాలేవీ జనసేన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి కానీ, పవన్ పర్సనల్ అకౌంట్ నుంచి కానీ షేర్ కాలేదు. పవన్ కల్యాణ్ కూడా కేంద్రం నిర్ణయాలను ప్రశంసించిన దాఖలాలు కూడా లేవు. స్నేహం బాగా ముదిరి పాకాన పడిన సందర్భంలో.. మోదీ ఏం మాట్లాడినా..ఇక్కడ పవన్ జేజేలు పలికేవారు, ఇతర కేంద్రమంత్రులు ఏ నిర్ణయం ప్రకటించినా శెహభాష్ అంటూ పవన్ ఓ ట్వీట్ పడేసేవారు.

కానీ ఇప్పుడా సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఎవరికి వారే, యమునా తీరే అన్నట్టుంది పరిస్థితి. ఏపీలో వరద బాధితులను పరామర్శించే సందర్భంలో కూడా రెండు పార్టీల నేతలు ఎవరికి వారే అన్నట్టున్నారు. దూరం పెరగడం వల్లే పవన్, తెలంగాణలో జరుగుతున్న దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లలేదని తెలుస్తోంది. బీజేపీ ఆహ్వానించినా కూడా.. కేసీఆర్ తో గొడవ పెట్టుకోవడం ఇష్టంలేక పవన్ ఆ ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉన్నారు. కనీసం స్థానిక జనసైనికులకు కూడా బీజేపీతో కలసి పనిచేయండనే సంకేతాన్ని కూడా పవన్ ఇవ్వలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఇటు ఏపీలో పార్టీ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించుకున్న బీజేపీ.. జనసేన నాయకులకు ఆహ్వానమే పంపించలేదు. కనీసం మిత్ర పక్షం అనే మర్యాదకూడా ఇవ్వలేదు. ఈ పరిణామాలన్నీ రెండు పార్టీల మధ్య దూరాన్ని క్రమక్రమంగా పెంచేశాయి. ఈ దూరం ఇలాగే శాశ్వతంగా ఉంటుందా? లేక.. కేంద్రం జోక్యం చేసుకుని సర్దిచెబుతుందా..? వేచి చూడాలి.