బాబోయ్ బాలయ్య… అస్సలు తగ్గట్లేదు

17 ఏళ్ల కిందటే మెగాఫోన్ పట్టుకున్నాడు బాలయ్య. తొలి ప్రాజెక్టుకే ఏకంగా నర్తనశాల లాంటి మైథలాజికల్ మూవీ హ్యాండిల్ చేయబోయాడు. బాలయ్య దురదృష్టమో లేక విధి విచిత్రమో కానీ ఆ ప్రాజెక్టు ఆదిలోనే ఆగిపోయింది. అలా ఏళ్ల తరబడి ఆగిపోయిన నర్తనశాల ప్రాజెక్టును తాజాగా వదిలించుకున్నాడు బాలయ్య. అప్పట్లో తీసిన కొన్ని సన్నివేశాలకు, తన తండ్రి ఎన్టీఆర్ నటించిన నర్తనశాల బిట్స్ కొన్ని కలిపి విడుదల చేసి మమ అనిపించారు. అయితే ఈ క్రమంలో బాలయ్య చేసిన ఓ ప్రకటన ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది.

17 నిమిషాల నర్తనశాల విజువల్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందట. తను తీసిన సన్నివేశాలకు (తీసింది ఒకటే సీన్), తన దర్శకత్వ ప్రతిభకు అంతా వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారట. దీంతో నర్తనశాల ప్రాజెక్టును మళ్లీ మొదలుపెడతానని ప్రకటించారు బాలయ్య.

నిజంగా ఇది షాకింగ్ ప్రకటనే. ఎందుకంటే నర్తనశాల దెబ్బకు మెగాఫోన్ ను మూలనపడేశారు బాలయ్య. ఆ తర్వాత ఎంతోమంది దర్శకత్వం చేయమన్నారు, ఒక దశలో తనకు కూడా దర్శకత్వ ఆలోచనలు వచ్చాయి. వందో సినిమాను తన స్వీయ దర్శకత్వంలో చేయాలనుకున్నారు. కొడుకును స్వీయ దర్శకత్వంలో పరిచయం చేయాలనుకున్నారు.

కానీ సెంటిమెంట్స్ ఎక్కువగా ఫాలో అయ్యే బాలయ్య.. తనకు దర్శకత్వం అచ్చిరాదని మానసికంగా ఫిక్స్ అయిపోయారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఫ్రెష్ గా నర్తనశాల మళ్లీ తీస్తానంటూ ప్రకటించడం విడ్డూరమే.