గీతం మెడికల్ కాలేజీ అనుమతి రద్దుచేయమని ఎన్ఎంసికి లేఖ రాసిన విజయసాయి రెడ్డి

విశాఖలో గీతం విద్యాసంస్థల అక్రమాలు ఒక్కొక్కటే బైటపడుతున్న వేళ.. గీతం అనుబంధ మెడికల్ కాలేజీ.. గీతమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్.. (GIMSR) అనుమతులు రద్దు చేయాలని కోరుతూ ఎంపీ విజయసాయిరెడ్డి జాతీయ వైద్యమండలికి లేఖ రాశారు. ఎన్ఎంసి చైర్మన్, సెక్రటరీకి ఆయన రాసిన లేఖలో ప్రధానంగా గీతం విద్యాసంస్థల అక్రమాలను ప్రస్తావించారు.

ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, అక్రమంగా భవనాలు నిర్మించి, ఆ అక్రమ భవనాలు, స్థలాన్ని చూపించి మెడికల్ కాలేజీకి అనుమతులు తీసుకున్నారని ఆరోపించారు. 2015లో గీతం విద్యాసంస్థలకి అనుబంధంగా GIMSR ఏర్పడింది. ఎంసీపై అనుమతులకోసం గీతం విద్యాసంస్థలు తప్పుడు డాక్యుమెంట్లను సమర్పించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

లేఖలో విజయసాయి రెడ్డి పేర్కొన్న అంశాలు..

  • విశాఖ పట్నం రుషికొండ దగ్గరి ఎండాడ గ్రామంలో గీతం వర్శిటీ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించింది. ఎంసీఐ అనుమతులకోసం ఆ సంస్థ సమర్పించినవన్నీ తప్పుడు డాక్యుమెంట్లే. తప్పుడు సేల్ డీడ్ చూపించి అనుమతులు తెచ్చుకున్నారు. ఎంసీఐ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ ని వెరిఫై చేసిందా లేదా.. అనే అనుమానం ఉంది.
  • గీతం మెడికల్ కాలేజీ తనదిగా చెప్పుకుంటున్న భూమి వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించింది. గీతం కాలేజీకి చెందిన భూమితోపాటు, ప్రభుత్వ భూమిని కూడా తమదిగా చెప్పుకుని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో విచారణ చేయగా.. 40ఎకరాల 51సెంట్లు ఆక్రమించినట్లు తేలింది.
  • ప్రభుత్వంతో లీజు అగ్రిమెంట్లు లేకుండానే భవనాలు, హాస్టల్ బిల్డింగ్ లు, స్టాఫ్ క్వార్టర్లు అన్నీ కట్టారు. గీతం మెడికల్ కాలేజీకి సంబంధించిన అన్ని భవనాలు ఆక్రమిత స్థలాల్లో నిర్మించినవే.
  • ఎంసీఐ అనుమతిచ్చేటప్పుడు వివాదంలేని భూమిలో కాలేజీ నిర్మించి ఉండాలని చెబుతారు. కానీ ఇక్కడ ఆ ప్రమాణాలు పాటించలేదనేది స్పష్టంగా తెలుస్తోంది.
  • 2015లో ప్రారంభమైన గీతం మెడికల్ కాలేజీలో ఆ తర్వాత స్టాఫ్ తక్కువగా ఉన్నారన్న కారణంగా 2017-18 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లు రద్దు చేశారు. అయితే పర్మినెంట్ స్టాఫ్ ని నియమించుకుంటామనే హామీతో గీతం మెడికల్ కాలేజీ విద్యార్థులను చేర్చుకుంది. అయితే తర్వాత ఆ హామీని నిలుపుకోలేక పోయింది. గీతంలో పనిచేసే మెడికల్ స్టాఫ్ అంతా పార్ట్ టైమ్ లెక్చరర్లు మాత్రమే.
  • గతంలో తనిఖీకి వచ్చిన ఎంసీఐ సిబ్బందిపై గీతం వర్సిటీ రాజకీయ ఒత్తిడి తెచ్చిందనేది వాస్తవం. అప్పటి ప్రభుత్వం గీతం సంస్థకు అండగా నిలబడి సిబ్బందిని భయపెట్టినట్టు కూడా ఆరోపణలున్నాయి. వీటిపై విచారణ జరిపించాలి.
  • వెంటనే గీతం మెడికల్ కాలేజీకి ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ రద్దు చేసేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజయసాయిరెడ్డి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి రాసిన లేఖ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.