అంతా రెడీ చేసిన పుష్ప

బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో రావాల్సిన పుష్ప సినిమా లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడా సినిమా మళ్లీ సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం సర్వం సిద్ధమైంది.

రంపచోడవరం సమీపంలోని మారేడుమిల్లి అటవీప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో అక్కడ కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఈ మేరకు అక్కడున్న ఉడ్స్ రిసార్ట్స్ మొత్తాన్ని రిజర్వ్ చేసింది పుష్ప యూనిట్.

సినిమా షెడ్యూల్ కంప్లీట్ అయ్యేంతవరకు ఎవ్వరూ బయటకు వెళ్లడానికి వీల్లేదు. అటవీ ప్రాంతంలో షూటింగ్, తిరిగి రిసార్ట్స్ లో ల్యాండింగ్. బయట వ్యక్తులు రిసార్ట్స్ లోకి రావడానికి, యూనిట్ సభ్యులు బయటకు వెళ్లడానికి వీల్లేదు. ఈ మేరకు యూనిట్ లో లైట్ బాయ్ నుంచి డైరక్టర్ వరకు అందరికీ ఐడీ కార్డులు ఇవ్వబోతున్నారు.

ఇలా కట్టుదిట్టమైన చర్యల మధ్య పుష్ప షూట్ ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే అల్లు అర్జున్ పూర్తిస్థాయిలో మేకోవర్ అయ్యాడు. ఫుల్ గా జుట్టు, గడ్డాలు పెంచాడు. మా ఇంట్లో ఒకడు పెద్ద జుట్టేసుకొని తిరుగుతున్నాడంటూ అల్లు అరవింద్, అప్పుడే కొడుకుపై జోకులు కూడా మొదలుపెట్టారు.