రాజశేఖర్ కు ప్లాస్మా థెరపీ

హీరో రాజశేఖర్ కు ప్లాస్మా థెరపీ అందిస్తున్నారు. ఈ విషయాన్ని సిటీ న్యూరో సెంటర్ వైద్యులు ప్రకటించారు. కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతూ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న రాజశేఖర్ కు ప్లాస్మా ఎక్కించినట్టు తెలిపారు వైద్యులు.

తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కరోనా సోకిన విషయాన్ని ఈనెల 17న హీరో రాజశేఖర్ కన్ ఫర్మ్ చేశారు. అయితే అప్పటికే కూతుళ్లు శివానీ, శివాత్మిక ఇద్దరూ కోలుకున్నట్టు ఆయన ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు భార్య జీవిత కూడా కరోనా నుంచి కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నప్పటికీ, ఆయన ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. తాజాగా ఆయనకు ప్లాస్మా థెరపీతో పాటు సైటోసార్బ్ డివైస్ తో చికిత్స అందించారు.

కొన్ని రోజుల కిందట రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ పుకార్లు చెలరేగాయి. అప్పట్నుంచి హాస్పిటల్ వర్గాలు రాజశేఖర్ హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కొద్దిసేపటి కిందట బులెటిన్ రిలీజ్ చేసిన డాక్టర్స్.. అతడికి ప్లాస్మా ఎక్కించినట్టు తెలిపారు