‘మగవారికి చైల్డ్ కేర్ లీవు… ప్రజల్లోకి వెళ్లాలి’ !

గర్భం దాల్చడం, ప్రసవం, శిశువు పోషణ… ఇవన్నీ మహిళలకు సంబంధించిన విషయాలు కనుక  మెటర్నటీ లీవు కూడా మహిళలకే ఉంటుంది. కానీ చైల్డ్ కేర్… అంటే అప్పుడే పుట్టిన శిశువు పోషణ, సంరక్షణలకు అవసరమైన సెలవులను  ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న మగవారు సైతం పొందవచ్చు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. పాత ఆలోచనలను పక్కనపెట్టి కొత్త తరహా దృక్పథంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొంతకాలంగా అమల్లో ఉన్నా తగినంత స్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేదని, సింగిల్ పేరెంట్ గా ఉన్న మగ ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు.

అవివాహితులు, భార్య మరణించినవారు, విడాకులు పొందినవారు… తదితర పరిస్థితుల్లో ఉండి సింగిల్ పేరెంట్ గా శిశువుని పెంచాలనుకుంటున్న… ప్రభుత్వ ఉద్యోగులైన మగవారు చైల్డ్ కేర్ లీవుని పొందవచ్చని ఆయన వెల్లడించారు. అంతేకాదు చైల్డ్ కేర్ లీవులో ఉన్న మగ ఉద్యోగి.. తన పై అధికారుల అనుమతితో తను పనిచేస్తున్న కార్యాలయం ఉన్న ఊరుని విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లవచ్చని, చైల్డ్ కేర్ లీవులో ఉన్నప్పటికీ  ప్రయాణ రాయితీ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు.

వంద శాతం సెలవు జీతంతో మొదటి 365 రోజులు, 80శాతం సెలవు జీతంతో మరో 365 రోజుల పాటు మగవారు చైల్డ్ కేర్ లీవుని పొందవచ్చని సింగ్ వెల్లడించారు. మగవారికి పిల్లల సంరక్షణ సెలవు ని ఇవ్వటంతో పాటు… అంగవైకల్యం ఉన్న పిల్లలకు తల్లిదండ్రులైన ఉద్యోగులకు ఇచ్చే సెలవు విషయంలో ఉన్న నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసింది.

ఇంతకుముందు అంగవైకల్యం ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులు.. తమ పిల్లలకు 22 ఏళ్ల వయసు వచ్చే వరకు చైల్డ్ కేర్ లీవుని వినియోగించుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ వయోపరిమితి నిబంధనను తీసేసింది.