పెళ్లి మేటర్ పై క్లారిటీ ఇచ్చిన మెగాహీరో

తన పెళ్లిపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు మెగా హీరో సాయితేజ్. ఇన్నాళ్లూ పెళ్లికి దూరంగా ఉన్న ఈ హీరో, సంబంధాలు చూడమని ఇంట్లో చెప్పేశాడు. ఈమధ్య కొన్ని రోజులుగా సాయితేజ్ పెళ్లిపై చాలా కథనాలు వస్తున్నాయి, అతడికి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అవన్నీ నిజమేనని స్పష్టంచేశాడు ఈ హీరో.

దాదాపు ఏడాది నుంచి పెళ్లి చేసుకోమని ఇంట్లో సతాయిస్తున్నారట. దీంతో అమ్మ పోరు పడలేక, తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సాయితేజ్. కొడుకు పచ్చ జెండా ఊపడంతో సాయితేజ్ తల్లి వెళ్లి చిరంజీవిని కలిశారు. ఇద్దరూ కలిసి సాయితేజ్ కు మంచి సంబంధం చూసే పని పెట్టుకున్నారు.

అయితే తను సంబంధాలు చూడమని మాత్రమే చెప్పానని, ఇప్పటివరకు ఎలాంటి మ్యాచ్ ఫిక్స్ అవ్వలేదని అంటున్నాడు సాయితేజ్. మంచి సంబంధం వచ్చి, పిల్ల బాగుందని చెబితే అప్పుడు తను పెళ్లి గురించి ఆలోచిస్తానంటున్నాడు.