నిమ్మగడ్డకు షాకింగ్ రిపోర్టు ఇచ్చిన సీఎస్‌

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని ఈసీకి ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలిశారు. ఎన్నికల నిర్వాహణపై ప్రభుత్వ వైఖరిని నిమ్మగడ్డకు స్పష్టంగా వివరించారు.

కరోనా నియంత్రణ విషయంలో ఏపీ దేశంలోనే అత్యుత్తమంగా పనిచేస్తోంది… కానీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని వెల్లడించారు. కేసులు తగ్గుతున్నా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలను సమావేశంలో అధికారులు ప్రస్తావించారు.

11 వేల మందికి పైగా పోలీసులే కరోనా బారిన పడ్డట్టు వివరించారు. కరోనా నియంత్రణలో యంత్రాంగం నిమగ్నమై ఉందని, అందుకోసం నిరంతరం పనిచేస్తున్నట్టు సీఎస్ తన నివేదికలో ఈసీకి చెప్పారు.

ప్రస్తుతానికి ఎన్నికలు నిర్వహించేందుకు అనుకూలమైన పరిస్థితులు లేవని… అనుకూల పరిస్థితులు రాగానే తెలియజేస్తామని నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు సీఎస్ నీలం సాహ్ని వివరించారు.