ప్రచారం కోసం ఇంత డ్రామా అవసరమా?

సినిమా ప్రచారం మరీ శృతిమించుతోంది. ఒకప్పుడు బాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ఈ వికృత ప్రచారం మెల్లగా టాలీవుడ్ కు కూడా వచ్చేసింది. మొన్నటికిమొన్న జీవితంలో కీలక నిర్ణయం అంటూ పెళ్లి అర్థం వచ్చేలా సందీప్ కిషన్ ట్వీట్ చేశాడు. కట్ చేస్తే, మరసటి రోజు సినిమా ప్రకటన చేశాడు. ఇది కూడా తన జీవితంలో కీలకమైన నిర్ణయమే అంటూ సెటైర్లు వేశాడు.

అంతకంటే ముందు తేజశ్వి మడివాడ తనకు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు చాలా ఉన్నాయని సంచలన ప్రకటన చేసింది. చాలామంది హీరోయిన్లపై పరోక్షంగా విమర్శలు కూడా చేసింది. కట్ చేస్తే, తను చేసిన ఓ సినిమా ప్రచారం కోసమే అలా మాట్లాడాల్సి వచ్చిందని, తనకు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు లేవని కలరింగ్ ఇచ్చింది. ఇలా టాలీవుడ్ లో కొత్తపుంతలు తొక్కుతున్న ప్రచారంలోకి తాజాగా పునర్నవి కూడా ఎంటరైంది.

కొద్దిసేపటి కిందట తనకు నిశ్చితార్థం జరిగినట్టు ఓ ఫొటో పెట్టింది బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి. తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ దిగిన ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో అంతా ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని అనుకున్నారు.

కట్ చేస్తే, అదంతా ఉత్తిదే అని తేలింది. ప్రస్తుతం ఆమె ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. దాని ప్రమోషన్ కోసమే తనకు ఇలా ఎంగేజ్ మెంట్ అయినట్టు డ్రామా షురూ చేసింది పునర్నవి.

https://www.instagram.com/p/CG4vHiQHD8A/