టిడ్కో ఇళ్లకోసం ధర్నా చేయాల్సింది బాబు ఇంటి ముందే – మంత్రి బొత్స

టిడ్కో ఇళ్లను సంక్రాంతిలోపు లబ్ధిదారులకు కేటాయించలేకపోతే.. వాటిని టీడీపీ ఆధ్వర్యంలో పేదలకు స్వాధీనపరుస్తామంటూ చంద్రబాబు చేస్తున్న హెచ్చరికలపై తీవ్ర స్థాయిలో స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ.

6లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చామంటున్న బాబు కనీసం లక్ష ఇళ్లను కూడా పూర్తి చేయలేదంటూ విమర్శించారు. చంద్రబాబు హయాంలో కట్టిన ఇళ్ల లెక్కను మంత్రి బైట పెట్టారు. చంద్రబాబు హయాంలో కేంద్రం 7 లక్షల ఇళ్ళు మంజూరు చేస్తే.. అందులో 3 లక్షల ఇళ్ళకు పునాది పడింది. మరో 2,62,216 ఇళ్ళు బేస్ మెంట్ వరకూ వచ్చాయి. చంద్రబాబు దిగిపోయేనాటికి కేవలం 81,040 ఇళ్ళు మాత్రమే 80-90 శాతం వరకు నిర్మాణం జరిగాయి. మరో 71 వేలు ఇళ్ళు 20 నుంచి 30 శాతం పనులు జరిగాయి. మరి చంద్రబాబు 6 లక్షల ఇళ్ళు ఎక్కడ కట్టించారో చూపించాలంటూ ప్రశ్నించారు మంత్రి.

ఇళ్ళు కడితే ఎగిరిపోతాయా..? క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలిద్దాం.. లొకేషన్, లెక్కలతో సహా చూపిస్తానంటూ సవాల్ విసిరారు. రూ. 3,200 కోట్లు టిడ్కో కాంట్రాక్టర్లకు బకాయి పెట్టి చంద్రబాబు గద్దె దిగిపోయారని గుర్తు చేశారు. పేదలకు కట్టించే ఇళ్ల విషయంలో కూడా చదరపు అడుక్కి రూ.500 నొక్కేశారని చెప్పారు. చివరకు పేదల్ని బ్యాంకులకు బకాయిదారులుగా మార్చేశారని అన్నారు.

300 చదరపు అడుగుల ఇళ్లను వైసీపీ ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తోందని చెప్పారు. బ్యాంకులకు లబ్ధిదారులు కట్టాల్సిన 3లక్షల రూపాయల్ని ప్రభుత్వమే భరిస్తుందని, తద్వారా ఖజానాపై 600కోట్ల రూపాయల భారం ఏర్పడుతుందని చెప్పారు. మహిళల పేరిట ఈ ఇళ్లను రిజిస్టర్ చేయిస్తామన్నారు. వీటిపై సమీక్ష తుది దశకు చేరుకున్న సమయంలో.. టీడీపీ సంక్రాంతి నాటకాలు మొదలు పెట్టిందని, టీడీపీ ఒత్తిడితో వైసీపీ ఈ ఇళ్లను పేదలకు ఇచ్చిందని గొప్పలు చెప్పుకోడానికే ఈ నాటకం ఆడుతోందని విమర్శించారు బొత్స.

రాష్ట్రవ్యాప్తంగా 30లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమంపై కోర్టుల్లో కొర్రీలు వేస్తూ రాక్షసానందాన్ని పొందుతున్న చంద్రబాబు.. వైసీపీకి ఆ ఘనత దక్కకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అడ్డుపడకుండా ఉంటే.. వైఎస్ఆర్ జయంతి రోజున ఇళ్లపట్టాల పంపిణీ మొదలయ్యేదని, ఈపాటికి ఇళ్ల నిర్మాణం కూడా గాడినపడేదని చెప్పారు.

టిడ్కోతో కలిపి మొత్తమ్మీద రాష్ట్రంలో 32లక్షలమందికి ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టబోతోందని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా దీన్ని కొనసాగించి తీరుతామని చెప్పారు. టిడ్కో ఇళ్ల ముందు ధర్నా చేస్తామంటున్న బాబుకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు బొత్స. ధర్నా చేయాల్సి వస్తే.. రూ.3,200 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిపోయిన బాబు ఇంటిముందు ధర్నా చేయాలని చెప్పారు.

ఇక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని, దీనిపై కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తామని అన్నారు. అవసరమైతే టైమ్ లైన్ లో పూర్తి చేసే విధంగా ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేందుకు సైతం సిద్ధమని స్పష్టం చేశారు. ధన దాహం కోసం రాష్ట్రానికి జీవనాడి అయిన ప్రాజెక్టును చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించారు. 2018లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని తొడలు గొట్టింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.

చంద్రబాబు మాటలు ఎప్పుడూ కోటలు దాటుతుంటాయని, ఆచరణ మాత్రం గడప దాటదని ఎద్దేవా చేశారు. రైతు కోసం, రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని, ఏ రాష్ట్రంలో లేని విధంగా గిట్టుబాటు ధరలు ప్రకటించి, ప్రభుత్వమే ఆ ధరలకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటోందని చెప్పారు. రైతుల గురించి టీడీపీ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.